సాయమంటే చాలు... అతని చేతికి ఎముకలే ఉండవు. సాయం చేసేకొద్దీ ఊపొస్తుందేమో అన్నట్టుంటుంది ఆ ఉదారగుణం. తినడం, ఇంట్లో వారితో గడపడం, నిద్రపోవడం. కరోనా కల్లోల కాలంలో అందరి దినచర్య దాదాపు ఇలాగే మారిపోయింది. సాయం, చేయూత, తోడ్పాటు, అండ. ఇది అతని దినచర్య అంటే అతిశయోక్తి కాదు. బొమ్మాళి అంటూ ప్రేక్షకులను భయపెట్టిన సోనూసూద్.... కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అభయమిస్తున్నాడు.
లాక్‌డౌన్ వేళ.... వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలను ప్రత్యేక విమానాలు, బస్సుల్లో తరలించిన సోనూ... మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. వేల కిలోమీటర్ల దూరంలోని ఓ రైతు కష్టాన్ని తీర్చాడు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్‌రాజ్‌పల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు.. మదనపల్లెలో ఓ టీ దుకాణం నడుపుతుండేవాడు. లాక్‌డౌన్ కారణంగా సొంతూరికి వచ్చి వేరుశెనగ పంట వేయాలనుకున్నాడు. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లు అందుబాటులో లేవు. కూలీలను పెట్టుకునే స్థోమత లేదు. తండ్రి కష్టాన్ని గుర్తించిన ఇద్దరు కుమార్తెలు వెన్నెల, చందన.. కాడెద్దులుగా మారారు. ఈ దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న సోనూసూద్.... తొలుత వారికి రెండు ఎద్దులు అందిస్తానని ట్వీట్ చేశాడు. కాసేపటికే... అవి వారికి చాలవంటూ ట్రాక్టర్‌ను తక్షణమే ఇస్తానని హామీ ఇచ్చాడు.