చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఆరె పంచాయతీ పరిధి జ్ఞానమ్మకండ్రిగలో 150 కుటుంబాల వారు సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నివాసముంటున్నారు. ఇందులో 30 కుటుంబాల వారు వారి ముత్తాతలనాటి భూమిలో ఇళ్లు నిర్మించుకుని గత 50 ఏళ్లుగా ఉంటున్నారు. ఇది ఆరె రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 204/11లో 1.53 ఎకరాల భూమిలో ఈ నివాసాలున్నాయి. దీనిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అడ్డదారిలో పట్టాదారు పాసు పుస్తకం చేసుకుని ఆన్‌లైన్‌లో తనపేరు మీద మార్చుకున్నారు. అంతేకాకుండా ఆ భూమిని పట్టాదారు పాసు పుస్తకంలో ఎక్కించుకుని పలు బ్యాంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా రుణం తీసుకున్నాడు.
ఊరిని బ్యాంకుకు తాకట్టు పెట్టేశాడు..
జ్ఞానమ్మకండ్రిగ... 150 కుటుంబాలు ఉన్న చిన్న గ్రామం.... తాతాల నాటి నుంచి వస్తున్న స్థలాల్లో స్థానికులు ఇళ్లు కట్టుకుని సుఖంగా ఉంటున్నారు. ఈ ఇళ్ల స్థలాలను రెవెన్యూ సిబ్బంది సహకారంతో పట్టాదారు పాసు పుస్తకం చేసుకుని పలు బ్యాంకుల్లో ఊరిని తాకట్టు పెట్టేశాడో ప్రభుద్ధుడు.
ఊరిని బ్యాంకుకు తాకట్టు పెట్టేశాడు....
గ్రామస్థులతో అతను మాట్లాడుతున్న తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతన్ని నిలదీయటంతో నిజాన్ని అంగీకరించాడు. తనకు తెలియకుండానే పాస్ పుస్తకంలో సర్వే నెంబర్ నమోదైందని... త్వరలో గ్రామస్థులకు అప్పగిస్తానని చెప్పాడు. ఈ వ్యవహారం జరిగి ఏడాది గడుస్తున్నా... నేటికీ తమకు అప్పగించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.