A herd of elephants halchal : చిత్తూరు జిల్లా పలమనేరు గుడియాత్తం రహదారిలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. సుమారు గంటల కొద్దీ రోడ్డుపై వాటి హడావుడి కొనసాగింది. ఏనుగుల గుంపు గత నాలుగు రోజులుగా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పరిధిలో సంచరించాయి. పలు గ్రామాల పరిధిలో పంటపొలాలను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఏనుగుల గుంపు శుక్రవారం ఉదయం గుడియాత్తం రోడ్డుపై ప్రవేశించాయి. వాహనదారులు భయాందోళనలతో కాసేపు రోడ్డుపై వాహనాలు నిలిపి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం రోడ్డుపై ఉన్న ఏనుగుల్ని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా అటవీ ప్రాంతం వైపు మళ్లించారు.
అర్ధరాత్రి పంటల ధ్వంసం.. పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పాలమాకులపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. సుమారు 15 ఏనుగులు 5 ఎకరాల మేర ఆస్తిని నష్టం చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఐదుగురు రైతులకు చెందిన వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు.. టమోటా, బీన్స్, కోస, వరి కసువు, కొబ్బరి, అరటి చెట్లు ధ్వంసం చేశాయి. చుట్టుపక్కల స్థానికంగా అటవీ ప్రాంతం కావడంతో రోజూ సాయంత్రం ఏనుగుల గుంపు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు, కొబ్బరి, అరటి చెట్లను ధ్వంసం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం మండిపడ్డారు. ఏనుగుల గుంపు గ్రామం వైపు కూడా దూసుకు రావడంతో ఇళ్ల మీద దాడి చేస్తున్నాయని పలువురు భయాందోళన వ్యక్తం చేశారు. ఏనుగుల గుంపుల వల్ల ఆవులు, గొర్రెలు మేపే పరిస్థితి కూడా లేదని గ్రామస్తులు వాపోయారు. వారం రోజులుగా గుంపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. సాయంత్రం సమయంలో రైతులు బయటికి రావాలంటే భయపడుతున్నారని చెప్పారు.