ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ రైతు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పుల బాధ తాళలేక... రెండు రోజుల క్రితం రైతు ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిత్తూరు జిల్లా ములకలచెరువుకి చెందిన సతీష్ బాబు (38) పంట సాగు కోసం అప్పు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
డబ్బులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైన కారణంగా మనస్థాపం చెందాడు. రెండు రోజుల క్రితం తన ఇంటిలో ఉన్న విషపు గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు ప్రాణాలతో పోరాడిన ఆ రైతు సోమవారం తుదిశ్వాస విడిచాడు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న ములకలచెరువు పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.