Child injured by kite string: సరదాగా ఎగరవేసే గాలిపటం వలన ఓ చిన్నారికి దారుణం జరిగింది. ఆ పాప తన కుటుంబంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో గాలిపటం మాంజా చుట్టకొని తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం 6 సంవత్సరాల కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి తెలంగాణలోని వనస్థలిపురం నుంచి ఉప్పల్‌కి బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలోనే నాగోల్ వంతెన సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పిల్లర్‌కు గాలిపటం వేలాడుతూ ఉంది.
ఆ గాలిపటం మాంజా వారి ఇరువురికి తగిలింది. దీంతో చిన్నారి తండ్రికి ముక్కుకి గాయం అయింది. చిన్నారి మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే నాగోల్‌లోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి, అనంతరం చిన్నారిని ఎల్బి నగర్‌లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
"13వ తేదీన సాయంత్రం ఎల్బీ నగర్ పై వంతెన మీద బైక్‌పై వస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటం ఎవ్వరో ఎగరవేసింది ఆ పై వంతెనపై చిక్కుకొంది. గాలిపటం మాంజా తగిలి పాపకి మెడకి దెబ్బ తగిలింది. పాప తండ్రికి ముక్కుకి గాయాలు అయ్యాయి. సుప్రజ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేర్చాం. తరువాత రెయిన్బో ఆసుపత్రికి తీసుకొచ్చాం. పాపకి ప్రాణహాని లేదని చెప్పారు. కాకపోతే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దయచేసి ఎవరూ గాలిపటాలను రోడ్లపై ఎగరవేయకండి." - బాధితురాలి బంధువు