సంక్రాంతి అనగానే కోస్తా ఆంధ్రాలో కోడి పందాలు ఎలా గుర్తుకొస్తాయో..... అలాగే రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండగ కూడా గుర్తొస్తుంది. కోస్తా ఆంధ్రాలో కోళ్ళపందేలకు కోళ్ళను ఎలా సిద్ధం చేస్తారో.... చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ కోసం ఎద్దులను కూడా అలాగే సిద్ధం చేస్తున్నారనే చెప్పాలి. అయితే తమిళనాడు రాష్ట్రంలో జరిగే జల్లికట్టుకు ఎద్దుల్ని ముందు నుంచే సిద్ధం చేస్తారు. బలంగా, ఆరోగ్యంగా, దూకుడుగా ఉండేలా దాణా తినిపిస్తారు. అలాంటి ఎద్దుల కోసం ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలపై తమిళుల కన్ను పడిందని చెప్పాలి.
పశువుల పండగ ఎలా నిర్వహిస్తారంటే..
ప్రతి ఏటా జనవరి 15 నుంచి నెల చివరి వరకూ పశువుల పండుగ నిర్వహించడం చిత్తూరు జిల్లాలో తరతరాలుగా వస్తున్న ఆచారం. సంక్రాంతి పండగలో చివరి రోజు కనుమ పండగ. సంవత్సరం అంతా రైతులకు సహాయంగా ఉండే మూగజీవాలను ఆ కనుమ రోజున ఆరాధించడం ఇక్కడి ప్రజల సాంప్రదాయం. పండుగ ముందు రోజు నుంచే పశువులను సిద్ధం చేస్తారు. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను ఒక్కొక్కటిగా ఊరు మధ్యలో జనాలపైకి వదులుతారు. ఆవులను, దూడలను గుంపులు గుంపులుగా తరుముతారు. వాటిని నిలువరించి కొమ్ములకు కట్టిన చెక్క పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఇది చిత్తూరు జిల్లాలోని పశువుల పండగ తీరు.