ఒక్కరోజే 601 నామినేషన్లు..
చిత్తూరు జిల్లాలో తొలి రోజుతో పోలిస్తే.. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు సర్పంచి స్థానానికి కేవలం 184 మంది నామపత్రాలు సమర్పించగా.. బుధవారం ఏకంగా 601 మంది పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. వార్డుసభ్యుడి పదవికి మంగళవారం 213 మంది నామినేషన్లు వేయగా.. బుధవారం 1,295 వచ్చాయి. అత్యధికంగా పీటీఎం మండలంలో సర్పంచి స్థానానికి 85, మదనపల్లె గ్రామీణ 59, తంబళ్లపల్లెలో 56 నామపత్రాలు దాఖలయ్యాయి. రామసముద్రం మండలంలో తొలిరోజు కేవలం ఒకరే నామినేషన్ సమర్పించగా.. బుధవారం ఏకంగా 38 మంది వచ్చారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచికి 785, వార్డులకు 1,508 నామపత్రాలు దాఖలు చేశారు.
35 తిరస్కరణ..
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న చిత్తూరు డివిజన్‌లోని 20 మండలాల నుంచి సర్పంచి, వార్డు స్థానాలకుగాను 60 అప్పీళ్లు రాగా.. చిత్తూరు ఉప ఎన్నికల అధికారి (ఆర్డీవో) 35 నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో) 17 మంది సర్పంచి, అయిదు వార్డు అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగానే ఉన్నాయని భావించినా.. ప్రత్యర్థి అభ్యర్థులు వీటిపై అప్పీలు చేశారు. ఇవన్నీ నిబంధనల మేరకే ఉన్నాయని పేర్కొన్నారు. సర్పంచి పదవికి సంబంధించి 18 నామినేషన్లు, 20 వార్డు స్థానాలకు పత్రాలు సరిగా లేవని ఆర్వోలు 18 తిరస్కరించారు. ఇందులో ఇద్దరు సర్పంచి(నారాయణవనం మండలం), ఓ వార్డు సభ్యుడి (రామచంద్రాపురం మండలం) నామపత్రాలు సక్రమంగా ఉన్నాయని ఉప ఎన్నికల అధికారి నిర్ధారించారు. విజయపురం మండలంలో అప్పీలుకు వచ్చిన అయిదు, తవణంపల్లెలోని మూడు సర్పంచి నామినేషన్లూ తిరస్కరణకు గురయ్యాయి. నారాయణవనంలో నాలుగు రాగా రెండు నిబంధనల మేరకు లేవని తేల్చారు.
అభ్యర్థుల ఆందోళన బాట...
మదనపల్లెలో సర్పంచి ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు మదనపల్లె మండలం సీటీఎం, సీటీఎం క్రాస్, కోళ్లబైలు పంచాయతీకి చెందిన అభ్యర్థులు బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కేంద్రం వద్ద మధ్యాహ్నం 2.30 నుంచి వరుసలో నిలుచున్నారు. సాయంత్రం 5 గంటలు కావడంలో స్టేజ్-1 అధికారి నామినేషన్ల పత్రాల స్వీకరణ నిలిపివేసి బయటకు వచ్చే యత్నం చేశారు. అప్పటికే వరుసలో ఉన్న 10 మంది అభ్యర్థులు ఆయన్ని అడ్డుకున్నారు. పక్కనే ఉన్న కేంద్రంలో సాయంత్రం 5.30 వరకు నామినేషన్ పత్రాలను తీసుకుంటుండగా ఇక్కడ ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. స్టేజ్ 1 అధికారిని బయటకు రానివ్వకుండా అభ్యర్థులు అక్కడ బైఠాయించి ధర్నా చేశారు. తెదేపా మద్దతుదారులు, వైకాపాలో అసమ్మతివారు నామినేషన్లు వేస్తున్నారనే ఇలా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎంపీడీవో లీలామాధవి స్పందించి నామినేషన్లు స్వీకరించాలని చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: