వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు కృత్రిమ మేథను వినియోగించుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తీర్మానించింది. యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన - విస్తరణ విభాగం 50వ సలహామండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాన్ని అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆంగ్రూ ఉపకులపతి డా.విష్ణువర్థన్ రెడ్డి కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలోని వివిధ ఆర్ఏఆర్ఎస్ లకు సంబంధించిన శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది కాలంగా ఆంగ్రూ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అమలు చేసిన విస్తరణ పనులను సమీక్షించుకోనున్నట్లు అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ తెలిపారు. రైతులకు లబ్ధి చేకూరే విధంగా మేలైన రకాల వంగడాలను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహిస్తోందన్నారు.