Todays Crime News: విద్యుదాఘాతంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామంలో తంబిగానిపల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలలో భాగంగా రాణి మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలకు పాడె తగిలడంతో విద్యుదాఘాతంతో తిరుపతి, రవీంద్రన్, మునప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోస్టుమార్టం కోసం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురి శవాలను తరలించారు.
అనంతపురం నగరంలో కబ్జాదారుల బెదిరింపులకు ఓ వ్యాపారి బలయ్యాడు. రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జారాయుళ్లకు వత్తాసు పలకడంతో తీవ్ర మనోవేదన చెంది తుమ్మల వంశీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా చిన్నపలకలపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ 30 ఏళ్ల కిందట అనంతపురానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అయితే 20 ఏళ్ల కిందట అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామ సమీపంలో 5.68 ఎకరాల భూమి కొన్నాడు. ఈ భూమి కోసం తిమ్మాపురం బుల్లెట్ బాబు, తిమ్మాపురం సర్దార్, దూదేకుల కాసిం అనే ముగ్గురు కబ్జారాయుళ్లు, రూరల్ మండల ఆర్ఐ విష్ణు బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్ లో తుమ్మల వంశీ రాశారు. 20 ఏళ్ల కిందట భూమి కొని, తన భార్య సుభాషిని పేరుపై రిజిస్టర్ చేయించానని పాస్బుక్, సర్వే నెంబర్ తో ఆన్లైన్లో కూడా తన భార్య పేరుపైనే ఉందని సూసైడ్ నోట్లో రాశాడు. అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని మృతుడి భార్య సుభాషిణి కన్నీటిపర్యంతమయింది. ఘటన స్థలానికి ఒకటవ పట్టణ పోలీసులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.