Electric Buses at Tirumala: అద్దె ప్రాతిపదికన 100 విద్యుత్తు బస్సులకు ఇటీవల టెండర్లు ఖరారు చేసి, ఒప్పందం చేసుకున్న ఆర్టీసీ.. తిరుమల కొండపై నడిపేందుకు మరో 25 బస్సులను తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)-2 పథకం కింద ఒక్కో విద్యుత్ బస్సుకు రూ.35 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు తొలుత తిరుపతి అర్బన్, తిరుమల ఘాట్, విశాఖ, విజయవాడ, అమరావతి, గుంటూరు, కాకినాడలకు కలిపి 350 బస్సులను తీసుకునేందుకు టెండర్లు పిలిచారు.
ఇందులో తిరుపతి అర్బన్, తిరుమల ఘాట్‌లో చెరో 50 చొప్పున 100 బస్సులకు చెందిన టెండరును ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) దక్కించుకుంది. తాజాగా తిరుమల కొండపై నడిపేందుకు తమకు 25 విద్యుత్ బస్సులు కావాలని తితిదే కోరింది. వీటికి కూడా ఫేమ్-2 కింద సబ్సిడీ ఇవ్వాలంటూ ఆర్టీసీ అధికారులు కేంద్రానికి ఇటీవల లేఖ రాశారు. కేంద్రం అనుమతించాక మళ్లీ టెండర్లు లేకుండానే వీటిని అద్దె ప్రాతిపదికన నడిపే బాధ్యత ఈవే ట్రాన్స్ (మేఘా) సంస్థకే ఇవ్వనున్నట్లు తెలిసింది.