ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!? - చిత్తూరు జిల్లా వార్తలు

"నా కొడుక్కి కాలేజీ ఫస్ట్ ర్యాంక్ కావాలి.. నువ్వుంటే అది సాధ్యపడట్లేదు.. చెప్పు ఎంత డబ్బు కావాలి? నువ్వు ఈ కాలేజీ వదిలి వెళ్లిపోవాలి..” మహర్షి సినిమాలో హీరోకు విలన్ పెట్టిన బేరం ఇది! అది సినిమా కాబట్టి విలన్ కు చేత్తో బుద్ధిచెప్పి పంపిస్తాడు హీరో. అచ్చం ఇదే పరిస్థితి ఓ చదువుల తల్లికి ఎదురైంది. కానీ.. ఇది జీవితం కదా! పైగా.. తనో మైనారిటీ వర్గానికి చెందిన సామాన్యమైన ఆడకూతురు. పదో తరగతి చదువుతున్న పాపాయి. అధికార పార్టీని అడ్డుపెట్టుకున్న విలన్ ను ఏం చేయగలదు? ఏకంగా బడినుంచే పంపించేశారు!! "ఈ పాడు లోకంలో నేను మంచిగా చదువుకోవడం కూడా నేరమేనా?" అని తనలో తాను కుమిలిపోయిందా ఆభాగ్యురాలు! వేదనకు గురైంది.. ఆవేదనతో కుమిలిపోయింది.. ఇక, తనకు మిగిలింది చావేనని నిర్ణయించుకుంది..! భవిష్యత్తును కమ్మేసిన కారుచీకట్లు.. ఎదురుగా నిలబడ్డ క్రూర మృగాలు ఎంతగా భయపెట్టాయో చిట్టితల్లిని.. మౌనంగా రోదిస్తూ ఇంట్లో దూలానికి శవమై వేలాడింది. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలోని వాస్తవాలు.. సూసైడ్ నోటు రూపంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి! ఇంతకీ.. అసలేం జరిగింది??

SUICIDE
SUICIDE

By

Published : Mar 24, 2022, 10:49 AM IST

Updated : Mar 24, 2022, 11:01 AM IST

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన.. పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య ఘటనలో అసలు కోణం వెలుగులోకి వచ్చింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందంటూ.. మిస్బా రాసిన కన్నీటి లేఖ బయటపడింది. తాను మొదటి ర్యాంకు సాధించడం తన తోటి విద్యార్థినికి ఇష్టం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది. మిస్బా ప్రస్తావించిన విద్యార్థిని వైకాపా నేత కుమార్తె కావడం వివాదానికి ఆజ్యం పోసింది. తన కుమార్తెకే మొదటి ర్యాంకు రావాలని వైకాపా నేత ఒత్తిడి చేయడంతోనే... పాఠశాల యాజమాన్యం విద్యార్థిని మిస్బాను వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!!

చదువుల తల్లిని చంపేశారా..

మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వేధింపుల వల్లే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. కాగా.. ఆత్మహత్యకు ముందు మిస్బా రాసిన సూసైడ్ లెటర్ లోని కొత్త అంశాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. "నాన్నా.. నన్ను క్షమించు.. నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు.." అంటూ మిస్బా.. తన తండ్రి గురించి లేఖలో రాసింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందని మిస్బా పేర్కొంది. తాను బాగా చదవడం వల్ల తోటి విద్యార్థిని బాధపడుతోందని.. ఆమె తనను అర్థం చేసుకోలేకపోయిందని లేఖలో రాసింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ మిస్బా... లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.

చదువుల తల్లిని చంపేశారా..

పలమనేరులోని బ్రహ్మర్షి పాఠశాలలో చదువుతున్న మిస్బా.. మరో నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ తరుణంలో మిస్బాకు టీసీ ఇచ్చి వేరే పాఠశాలకు పంపింది యాజమాన్యం. ఆ తర్వాత మూడు రోజులకే మిస్బా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడంపై.. వివిధ రకాల వాదనలు వినిపించాయి. అయితే.. తాజాగా బయటకు వచ్చిన మిస్బా రాసిన లేఖ ద్వారా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలు కేసును మలుపుతిప్పేలా ఉన్నాయి. తాను బాగా చదువుతున్నందున తోటి విద్యార్థిని బాధపడుతోందంటూ.. మిస్బా లేఖలో ప్రస్తావించిన అమ్మాయి.. వైకాపా నేత కుమార్తె కావడం చర్చనీయాంశమైంది.

'నేను బాగా చదవడమే.. నాకు ఇబ్బందిగా మారింది నాన్న'

తన కుమార్తె కోసం ఆ నేత స్వయంగా మిస్బాను మరో పాఠశాలకు పంపించడం వల్లనే.. కలత చెంది ఆత్మహత్యకు పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిస్బా రాసిన లేఖను తమకు చూపకుండా.. పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మిస్బా కుటుంబసభ్యులను పరామర్శించిన తెలుగుదేశం నేత అమర్నాథ్‌రెడ్డి.. బాలిక బలవన్మరణంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు దర్యాప్తు చేసి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. బాలిక తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి :పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య... ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనే కారణం!

Last Updated : Mar 24, 2022, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details