విజయసాయి రెడ్డి కోసం రాజ్యాంగ విలువలను వైకాపా ప్రభుత్వం కాలరాస్తుందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు విజయసాయి రెడ్డికి దిల్లీలో పట్టం కట్టేందుకే... తప్పుడు జీవో ఇచ్చి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. తీరా గుట్టు రట్టయ్యేసరికి నాలుక కరుచుకొని జీవో రద్దు చేశారని దుయ్యబట్టారు.
దొడ్డిదారిలో ప్రభుత్వ ఎత్తుగడలు
13 రోజులపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పదవిలో ఉన్న విజయసాయి రెడ్డిని... ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్యాంగ పెద్దలకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయనుందని తెలిపారు. ఇది తెలిసి దొడ్డిదారిన మళ్ళీ విజయసాయి రెడ్డిని ప్రత్యేక ప్రతినిధిగా నియమించేందుకు ఇంకో ఎత్తుగడ వేశారన్నారు. ఆర్డినెన్సు ద్వారా విజయసాయి రెడ్డికి... దిల్లీ పదవి కట్టబెట్టే ప్రణాళిక వేశారన్నారు. దిల్లీలో తన కేసులపై లాబీయింగ్ కోసమే ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని యనమల ఆరోపించారు.