అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధుల ఉపసంహరణపై రాష్ట్రంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వైకాపా, తెదేపాలు మీ వల్లే అంటే.. మీ వల్లే అని కాళ్లు దువ్వుకుంటున్న పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే వెనక్కు తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అభ్యర్థనను వెనక్కు తీసుకున్నందునే ప్రపంచ బ్యాంకు అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తప్పుకుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి కేంద్రం వెనక్కు తగ్గడంతో... పనులు సక్రమంగా సాగవనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వం ఆర్థిక అభ్యర్థన ఎందుకు వెనక్కు తీసుకుందో తెలియదని అధికారులు తెలిపారు. ఈ అంశంపై సీఆర్డీఏ కమిషనర్ స్పందిస్తూ... కేంద్ర ఆర్థిక శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.