ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకాశంలో సగం!అవకాశాల్లో సగం!..రాజకీయాల్లో? - 2019 Elections

లేచింది మహిళా....లోకం...అని ఓ సినీ కవి నారీమణుల ప్రాతినిధ్యం గురించి గొప్పగా చెప్పారు. కానీ వాస్తవంగా జరుగుతుందేంటీ? ఆకాశంలో సగం...అవకాశాల్లో సగం..మరి రాజకీయాల పరిస్థితేంటీ? మూడు దశాబ్దాల పాటు మూడు శాతమే..ఒకసారైతే శూన్యమే.. నవ్యాంధ్ర తొలి శాసనసభలో 13 మంది మహిళలు అడుగుపెట్టారు.  మరి ఈసారి అసెంబ్లీ గడపలో అడుగుపెట్టే ఆడపడుచులు ఎంతమంది?

ఆకాశంలో సగం!అవకాశాల్లో సగం!..రాజకీయాల్లో?

By

Published : Apr 8, 2019, 7:16 PM IST

రాష్ట్రపతి, ప్రధాని, సభాపతి, కేంద్రమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి...ఇలా మహిళలు చేపట్టని పదవి లేదు. అయినా చట్టసభల్లో మహిళా శక్తి తక్కువ సీట్లకే పరిమితం. ఉమ్మడి రాష్ట్రంలో 13 సార్లు ఎన్నికలు జరిగాయి. నవ్యాంధ్రలో రెండోసారి జరగనున్నాయి. ఇన్నేళ్ల శాసనసభలో ఎప్పుడూ మహిళలు 12 శాతం దాటలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ బిల్లుపై ఏళ్లుగా చర్చ నడుస్తున్నా...ఆంధ్ర రాష్ట్రంలో మహిళా ప్రాతినిధ్యం అంతంత మాత్రమే..!
1962లో ఆంధ్రప్రదేశ్ లో 300 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగగా...10మంది మహిళలు ఎన్నికయ్యారు. అంటే 3.3 శాతం . 1967లో 287 స్థానాలకు ఎన్నికలకు జరిగితే 11 మంది మహిళలు ఎన్నికయ్యారు....3.8శాతం. 1972 లో 287 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. కనీసం ఒక్క మహిళా గెలవలేదు. 1978లో 294 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తే... 10 మంది మహిళా నేతలను ప్రజలు ఎన్నుకున్నారు. 1983,1985లోనూ అదే పరిస్థితి.
11.5 శాతమే రికార్డు
1989లో 17 మంది మహిళలు ఎన్నికవడంతో శాసన సభలో వారి శాతం... 5.7శాతానికి పెరిగింది. 1994లో మళ్లీ 3 శాతానికి పరిమితమైంది. 1999లో 28 మంది శాసన సభలో అడుగుపెట్టగా...వారి ప్రాతినిధ్యం 9.5 శాతానికి పెరిగింది. 2004లో 25 మంది మహిళలు ఎన్నికయ్యారు. 2009లో అత్యధికంగా 34 మంది ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఈ 11.5 శాతమే రికార్డు. 2014లో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి.. వేర్వేరు శాసనసభలు ఏర్పాటు అయ్యాయి. నవ్యాంధ్ర తొలిశాసనసభలో 175నియోజకవర్గాలకు గానూ 18 మంది ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు. తొలి శాసనసభలో కూడా వారి ప్రాతినిధ్యం తక్కువే.
ఈసారి బరిలో 80 మంది
2019లో కొలువుదీరబోయే శాసనసభలో అడుగుపెట్టేందుకు వివిధ పార్టీల నుంచి మహిళామణులు పెద్ద సంఖ్యలోనే సార్వత్రిక బరిలో నిలిచారు. తెదేపా 20, వైకాపా 15, జనసేన 18, సీపీఐ 1, కాంగ్రెస్ 12, భాజాపా 12 మందికి అవకాశం ఇవ్వగా.. మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. దాదాపుగా 80 మంది మహిళా నేతలు.. ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చూడాలి మరి ఈ సారి కొలువుదీరబోయే శాసనసభలో అతివల ప్రాతినిధ్యం ఎంత మేర ఉంటుందో?

ABOUT THE AUTHOR

...view details