హైదరాబాద్ గోల్నాకలోని మహిళలు నీటివృథాపై పోరాటానికి పూనుకున్నారు. నీరు పొదుపుగా వాడాలని అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. దీనికి వారి ఇంటి నుంచే శ్రీకారం చుట్టిన మహిళలు కాలనీలు, బస్తీల్లో చుక్క నీరు వృథా కాకుండా చూసుకునే బాధ్యత భుజానికెత్తుకున్నారు. బియ్యం కడిగిన నీళ్లను పిల్లలు ముఖం కడుక్కోవడానికి ఇవ్వడం, కూరగాయలు శుభ్రం చేసిన నీళ్లను మొక్కలకు పోయడం, బట్టలు ఉతికిన నీటిని మరుగుదొడ్లకు వాడటం ఇలా... వృథా అయ్యే ప్రతి సందర్భంలోనూ పొదుపుగా వాడుతూ నీటి కొరతను అధిగమిస్తున్నారు.
నీటి సంరక్షణలో భాగంగా నగరంలోని 150 డివిజన్లలో జలమండలి "జల నాయకత్వం-జల సంరక్షణ " పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి వృథాను అరికట్టాలంటే మహిళల వల్లే సాధ్యమవుతుందని గ్రహించిన జలమండలి కమిషనర్ దాన కిషోర్... నగరంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న నాలుగురన్నర లక్షల మంది మహిళలతో కలిసి జల ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డివిజన్ల వారీగా మహిళలకు అవగాహన కల్పిస్తూ గృహ సముదాయాల్లో, కాలనీల్లో జరుగుతున్న నీటివృథాని అరికట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జలమండలిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వారందరిని ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా నియమించారు.