ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బటన్ నొక్కితే...భద్రత కల్పిస్తాం

మహిళల భద్రతకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందోన్న విషయం అందరికి తెలిసిందే..ఇప్పటికే రాష్ట్ర పోలీసుశాఖ వారి భద్రత కోసం శక్తి టీంలను నియమించగా...ఇప్పడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  మహిళల భద్రతకోసం చర్యలకు ఉపక్రమించింది.

బటన్ నొక్కితే...భద్రత కల్పిస్తాం

By

Published : Apr 25, 2019, 4:54 AM IST

నిఘానీడలో ప్రయాణం
మహిళల భద్రతకు ఏపీఎస్​ఆర్టీసీ పెద్దపీట వేస్తోంది. బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ఆర్టీసీ మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల కోసం బస్సుల్లో ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు. ఎక్కువగా రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బస్సును రెండుగా విభజించి ముందు భాగాన్ని మహిళలకు కేటాయించారు. పురుషులు ఎవరూ మహిళల సీట్లలో కూర్చోకుండా ఉండేలా నిబంధనలు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారాన్ని తెలియజేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి అమలు చేస్తోంది.ఇప్పటికే కొన్ని బస్సుల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయగా దశలవారీగా అన్ని బస్సుల్లో కెమరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

బటన్ నొక్కితే...భద్రత కల్పిస్తాం
జీపీఎస్ వ్యవస్థకు శ్రీకారం మహిళలకు మరింత భద్రత కల్పించేలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు తీసుకుంటోంది. బస్సుల్లో అధునాతన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆపద , విపత్కర సమయాల్లో ఒక్క బటన్ నొక్కితే అందరూ అప్రమత్తమయ్యేలా జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా ఆపదలో ఉన్నవారిని వెంటనే రక్షించేలా చర్యలు తీసుకుంటోంది. బస్సులో పలు చోట్ల పానిక్ బటన్లను ఏర్పాటు చేసి జీపీఎస్ వ్యవస్థకు, పోలీసు కంట్రోల్ రూం కు అనుసంధానిస్తారు. పానిక్ బటన్ లను ఆపత్కాల సమయంలో గట్టిగా కొద్ది సేపు నొక్కితే చాలు కంట్రోల్ రూం కు ఫోన్ వెళ్తుంది. వెంటనే అక్కడున్న సిబ్బంది బస్సు ఉన్న లొకేషన్ ను క్షణాల్లో తెలుసుకుని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు ,ఆర్టీసీ అధికారులకూ సమాచారం అందిస్తారు. నిముషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి వెళ్లి పోలీసులు సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వ్యవస్థ పనిచేసే విధానంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాత దశలవారీగా అన్ని బస్సుల్లో అధునాతన జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా బస్సుల్లో ప్రయాణించే మహిళలకు మరింత భద్రత చేకూరడం ద్వారా భరోసా తో కూడిన ప్రయాణం సాకార మవుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details