వేసవైనా...శీతాకాలమైనా...ఆ గ్రామాల చెరువుల్లో నీటి కొరత ఉండదు. అయినా ఆప్రాంత వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. కారణం ఆ నీటి నుంచి వచ్చే దుర్వాసనే. గ్రామ సమీపంలోనే కృష్ణమ్మ పరవళ్లు పెడుతున్నా అక్కడి ప్రజల నీటి కష్టాలను మాత్రం తీర్చలేకపోతుంది. దాహం తీరాలంటే 3 మైళ్లు నడవాల్సిందే. ఇది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజవకవర్గం కోడూరు మండల పరిధిలోని గ్రామాల పరిస్థితి. కళ్ల ముందే నీళ్లు ఉన్నా తాగటానికి పనికి రాకపోవటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు.
కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు గుక్కెడు మంచి నీటి కోసం పడని కష్టమంటూ లేదు. కాలం ఏదైనా సరే విశ్వనాథపల్లి, వి.కొత్తపల్లి, జైపురం తదితర గ్రామవాసులు..తెల్లారి లేచింది మొదలు బిందెడు నీళ్ల కోసం పక్క గ్రామాల బాట పట్టాల్సిందే. వేసవి వచ్చిందంటే ఈ కష్టాలు మరింత పెరుగుతాయి. ఈ ప్రాంత వాసులంతా బిందెలు, క్యాన్ లు, బాటిళ్లు పట్టుకుని 3 మైళ్ల దూరంలోని మంచినీటి చేతి పంపు వద్దకు పయనమవుతారు.
అధికారుల నిర్లక్ష్యం..
ఈ గ్రామాల్లో నీటి కష్టాలకు ప్రకృతి పరిణామాలు ఓ కారణమైతే...అధికారుల నిర్లక్ష్యం మరో కారణం. ఏళ్ల క్రితం నిర్మించిన మంచినీటి చెరువులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీటి విడుదలకు ముందుగానే చెరువులను శుభ్రపరచాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తామర మొక్కలు, గుర్రపు డెక్క కేంద్రంగా మారాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా బ్యారేజీ నుంచి నీరు వచ్చి చేరినా అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొంది.