వ్యక్తిగత జీవితం నుంచి మొదలు... వృత్తి, వ్యాపార, రాజకీయ, సినిమా... ఇలా ఎన్నో రంగాల్లో విజయాలు అందుకున్న సబలల కథనాలతో మరేందరిలోనో స్ఫూర్తి నింపుతోంది ఈనాడు వసుంధర. వనితల ప్రతిభ పాఠవాలకు అక్షర రూపం ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఈనాడు మానస పుత్రిక... తొలిసారిగా వసుంధర పురస్కారాలతో విజయలక్ష్మిలను సత్కరించింది. సినిమా, క్రీడలు, వ్యాపారం, టీవీ, సంగీతం ఇలా 9 రంగాల్లో మేటిగా నిలిచిన తెలుగు ఆడపడుచులను అవార్డులతో గౌరవించింది...
క్రీడల్లోనూ మేమే...!
వసుంధర పురస్కరాల్లో భాగంగా యువ విజేతలుగా...చైనా సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధించిన ఫరీహ తఫిమ్, ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, క్రీడల్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ తరఫున వారి తల్లిదండ్రులు అవార్డులు అందుకున్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఎవరెస్ట్ ఎక్కి నిరూపించానని తెలిపింది మలావత్ పూర్ణ.
వ్యవసాయ, వైద్య, వాణిజ్య రంగాల్లోనూ...
రైతుల కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ రూపొందించిన జయ నల్లబోతుల, వాణిజ్య రంగంలో తనదైన ప్రతిభ కనబరుస్తున్న బిందు కునాటిని వసుంధర పురస్కారంతో సత్కరించారు. వైద్యరంగంలో గ్రామీణ స్థాయిలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ పద్మావతి, డాక్టర్ వెంకట కామేశ్వరీతో పాటు సామాజిక సేవారంగంలో కీలక పాత్రపోషిస్తున్న ప్రసన్న శ్రీ, మమతా రఘువీర్‌లకు శైలజా కిరణ్ అవార్డులను ప్రదానం చేశారు.