ఎన్నికల హామీలను అమలు చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ శాఖలు బలంగా ఉంటేనే... పథకాలు ప్రజలకు చేరుతాయని భావించారు. అందుకే తొలుత ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి.. అత్యవసరంగా భర్తీ చేయాల్సినవి ఏంటి? అనే దానిపై దృష్టి సారించారు.
వాలంటీర్లతో ప్రారంభం...
ప్రతి ఇంటికీ పాలన చేరాలనే సంకల్పంతో గ్రామ సచివాలయాలకు తెరలేపారు జగన్. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే.. నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 15లోపే సుమారు లక్షన్నర మంది వాలంటీర్లు విధుల్లో చేరబోతున్నారు. రానున్న బడ్జెట్లో ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు సైతం అందాయి.
కొత్త ప్రభుత్వం... ఆశావహుల్లో నూతనోత్సాహం మా గోడు ఆలకించండి...
2018లో పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి... 2723 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా... ఇప్పటికే తాము అర్హత పరీక్షల్లో అర్హత సాధించామని.. తక్కవ పోస్టులు ఉండటంతో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదని... ఆ నోటిఫికేషన్లోనే పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆ నోటిఫికేషన్ ఆధారంగానే తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.
మమ్మల్ని క్రమబద్ధీకరించండి...
ప్రత్యేక అవసరాల విద్యార్థుల బోధనకు సర్వశిక్షా అభియాన్లో 2001లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్పెషల్ టీచర్లను నియమించారు. ప్రస్తుతం 1476 మంది అందులో పనిచేస్తున్నారు. రాత పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికై రాష్ట్రపతి ఉత్తర్వులతో రోస్టర్ కం మెరిట్ పద్ధతిలో నియమితులైన తమను... క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.
విజ్ఞాపనలతో తాడేపల్లిలోని సీఎం నివాసం కళకళలాడుతోంది. ప్రతిరోజు వేలమంది అభ్యర్థనలతో కిక్కిరుస్తోంది. మరి... మన ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..!?
ఇదీ చదవండీ: ఆ మాయావృక్షం ఎదుట సురీడూ చిన్నబోవాల్సిందే!