నేడు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం - న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఇవాళ ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతనంగా నియమితులైన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణ 10.55 నిమిషాలకు హైకోర్టులో ప్రమాణ స్వీకారం జరగనుంది.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం విజయనగరం జిల్లా, పార్వతీపురం. 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2003 జనవరి 6 వరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత విశాఖపట్నం, 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి 2009 ఏప్రిల్ వరకు హైదరాబాద్ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు విశాఖ జల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2013 వరకు కృష్ణా జిల్లా జడ్జిగా, 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ 30 వరకు ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా చేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ సాఫీగా సాగిపోవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో చాలా కచ్చితంగా వ్యవహరిస్తారన్న పేరుంది.
జస్టిస్ వెంకటరమణ
జస్టిస్ వెంకటరమణ స్వస్థలం అనంతపురం జిల్లా, గుత్తి. ఈయన తండ్రి ఎం.నారాయణరావు న్యాయవాదిగా పనిచేశారు. 1982లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన తరువాత, తండ్రి వద్దనే వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. సీనియర్ న్యాయవాది జయరాం వద్ద వృత్తిపరంగా నిష్ణాతులయ్యారు. 1987లో జుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. మొన్నటి వరకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా వ్యవహరించారు. హైకోర్టు విభజన తరువాత కర్నూలు జిల్లా జడ్జిగా నియమితులై ప్రస్తుతం అదే పోస్టులో కొనసాగుతున్నారు.