ట్వీట్ వార్: మీరే తుగ్లక్.. కాదు మీరే తుగ్లక్ - ప్రజావేదిక కూల్చివేత
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, తెదేపా సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న మధ్య.. ట్వీట్ వార్ నడిచింది. ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై.. ఇరువురూ మాటల తూటాలు పేల్చారు. విమర్శకు ప్రతి విమర్శ చేసుకున్నారు.
ప్రజావేదిక భవనం కూల్చివేతపై.. మాజీ మంత్రి యనమల వ్యాఖ్యలను తప్పుబట్టారు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవాలంటూ.. యనమలకు సలహా ఇచ్చారు. అప్పుడు ఎవరు తుగ్లకో తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి తీరును తెదేపా సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. ట్వీట్‌కు ప్రతి ట్వీట్ చేశారు. గతంలో.. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి అనుమతులిచ్చిన మల్లాది విష్ణు.. ఇప్పుడు వైకాపాలోనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన్ను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కుంటే, తుగ్లక్ ఎవరో అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక మినహాయిస్తే.. కట్ట అంచున ఉన్న నిర్మాణాలకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చిన విషయాన్ని ఎందుకు మరిచారని బుద్ధా వెంకన్న నిలదీశారు.