నేడు ఎన్టీఆర్ జయంతి.. హాజరుకానున్న చంద్రబాబు
నేడు గుంటూరులోని తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ వేడుక అనంతరం రేపు తెదేపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ ఓటమి గల కారణాలతోపాటు..శాసనసభాపక్షనేత ఎవరనే దానిపై చర్చించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొలిసారి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఓటమి తర్వాత నాలుగైదు రోజులుగా పార్టీ నేతలను, కార్యకర్తలను కలుస్తున్న చంద్రబాబు..ఇవాళ గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈసారి మహానాడు కార్యక్రమం రద్దు అయినందున ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలను ఆదేశించింది.
నందమూరి తారక రామరావు...తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింప చేసిన మహానేత. సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లను నినదించిన ఆయన...జనమే ఊపిరాగా రాజకీయాలు చేశారు.తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశరాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు. అనతికాలంలోనే తెలుగు దేశం పార్టీకి పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింప చేసి..., ఆ ఘనత పోందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు. ఆయన 13ఏళ్ళ రాజకీయ జీవితంలో 4 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోన్నారు. మూడు సార్లు విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.. ఇక సినీరంగంలో ఎన్టీఆర్ ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి రాష్ట్రప్రజల్లో చెరగని ముద్రవేశారు.
ఎన్టీఆర్ జయంతి అనంతరం రేపు తెదేపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు తొలిసారి సమావేశమవుతారు. ఇందులోనే పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తారు. పార్టీ శాసనసభాపక్ష ఎవరు అనే దానిపైనా చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు.