ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుకు ధీమా.. బడ్జెట్​లో బీమా - agriculture budget

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ధరల స్థిరీకరణ నిధి, ముఖ్యమంత్రి అధ్యక్షతన అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స.. ప్రకటించారు.

రైతులకు భారీ ఎత్తున వరాలు

By

Published : Jul 12, 2019, 6:05 PM IST

రాష్ట్ర బడ్జెట్​లో రైతులకు భారీగా వరాలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రైతులకు దీర్ఘ కాలంగా మేలు చేసేలా ముందుకు కదులుతున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కౌలు రైతు కుటుంబాలనూ ఆదుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.28 వేల 866.23కోట్లతో వ్యవసాయ బడ్జెట్​ను మంత్రి బొత్స శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.27,946.65 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లు కేటాయించారు.

వైఎస్​ఆర్ రైతు బీమా

రైతులు.. ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదవశాత్తు మరణించినా... బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ రైతు బీమా పథకం కింద రూ.7లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. బడ్జెట్​లో దీని కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ధరల స్థిరీకరణ నిధి

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేందుకు వ్యవస్థీకృత సదుపాయాన్ని కల్పిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్ల రూపాయలను కేటాయించారు.

అగ్రికల్చర్ మిషన్

ముఖ్యమంత్రి అధ్యక్షతన అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు. అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఎప్పటికప్పుడు వ్యవసాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రతినెలా ఈ విషయంపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రకృత్తి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తున్నామని... దీనిని ఏవిధంగా కేటాయించాలో అగ్రికల్చర్ మిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.

జాతీయ ఆహార భద్రతా మిషన్

ఆహారపంటల విస్తీర్ణానికి, దిగుబడి పెంచేందుకు జాతీయ ఆహార భద్రతా మిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి 141.26 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు వెల్లడించారు.

నాణ్యమైన విత్తనాల పంపిణీ

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రూ.200 కోట్లతో బడ్జెట్ కేటాయించారు. కల్తీ లేని ఎరువులు, పురుగుల మందులనే రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడైనా పొరపాటున రైతులకు నష్టం కలిగితే సంబంధిత సంస్థే బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఆయా సంస్థల నుంచి ధరావతు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. మండలానికో గ్రామంలో మట్టి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ పథకానికి 30.43 కోట్లు ప్రతిపాదించారు.

ప్రకృతి వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తుగా ప్రోత్సహిస్తామని మంత్రి బొత్స అన్నారు. దీనికి రూ.91.31 కోట్లు కేటాయించారు. రాబోయే మూడేళ్లలో రైతులే స్వయంగా వారి ఉత్పత్తులు విక్రయించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

మరికొన్ని వరాలు

ఉద్యానశాఖకు రూ.1532 కోట్లు... ఆయిల్‌పామ్‌ రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయించారు. ఆయిల్‌పామ్‌ తోటల సాగు ప్రోత్సాహానికి రూ.65.15 కోట్లు... ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ.200 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు తుంపర, బిందుసేద్య పథకాల కోసం రూ.1105.66 కోట్లు... సహకార రంగ అభివృద్ధి కోసం రెవెన్యూ వ్యయం రూ.174.64 కోట్లు కేటాయించారు. సహకారరంగ అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ.60 కోట్ల నిధులు కేటాయించారు.

రైతుల రుణాలకు...

2019-20లో రైతులకు సహకార స్వల్పకాలిక రుణాల కింద రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. 2019-20లో రైతులకు సహకార దీర్ఘకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. కౌలు రైతులకు రూ.1200 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details