ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దూకుడు పెంచుదాం... దరి చేరుదాం!

అయిపోయిందేదో అయిపోయింది.. ఇక ముందు చేయాల్సిన దానిపై దృష్టి పెట్టాలనుకుంటోంది తెదేపా. అధికారంలో ఉండగా చేసిన పొరపాట్లు సరిదిద్దే పనిలో పడింది. ఓటమిని విశ్లేషించుకునే పనిని ముమ్మరం చేసింది. పార్టీకి మెుదటి నుంచి అండగా ఉన్న బీసీలు ఈసారి చెల్లాచెదురయ్యారనే భావనలో ఉన్న తెదేపా.. వారిని అక్కున చేర్చుకునేందుకు కార్యచరణ రూపొందిస్తోంది.

By

Published : Jun 2, 2019, 3:37 PM IST

TDP_REVIEW_ON_ELECTION_RESULTS

దూరమయ్యే వాళ్లు దగ్గరయ్యేలా తెదేపా ప్రణాళిక

పార్టీ ఆవిర్భావం నుంచి తెదేపా బీసీల పార్టీగా ఉన్నా... ఈసారి మాత్రం ఆ ఉనికి కోల్పోయింది. అయిదేళ్లు కాపులను బీసీల్లో చేర్చే అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ...అన్యాయం చేయమనే నమ్మకం వారిలో కల్పించలేకపోయింది. ఎప్పుడూ లేనంతగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. బీసీ యువకులకు స్వయం ఉపాధి కల్పన వంటివి చేపట్టింది. అందించిన ఫలాలను వివరించటంలో స్థానిక నాయకత్వం విఫలమైందనే భావన తెదేపా అధిష్ఠానంలో వ్యక్తమవుతోంది.

ఫలించిన వైకాపా వ్యూహం
వైకాపా ప్రతిపక్షంలో ఉండగా...తెదేపాకు బీసీలను దూరం చెయ్యడంలో విజయం సాధించిందని తెలుగుదేశం గుర్తించింది. సామాజిక మాధ్యమాలతోపాటు.. వైకాపా నేతల ప్రచారంతో బీసీలు దూరమయ్యారని భావిస్తోంది తెలుగుదేశం. కాపులకు పెద్ద పీట వేస్తూ...బీసీలను విస్మరిస్తోందనే అనుమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వైకాపా సఫలమైందని భావిస్తోంది. వారికి మళ్లీ దగ్గరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది.

మండలిలోనే బలం
తెదేపాకు 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఆ పార్టీ బలం నామమాత్రమే. మండలి వేదికగా తమ గళం వినిపించే అవకాశం తెలుగుదేశం పార్టీకి కొంతకాలం ఉండనుంది. 58 మంది సభ్యులున్న మండలిలో వైకాపా ఎమ్మెల్సీల బలం 8మంది మాత్రమే. తెలుగుదేశం పార్టీకి 31మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అసెంబ్లీతోపాటు మండలిని ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక చేసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది తెదేపా.

ఎవరికి ప్రతిపక్ష నేత హోదా?
మండలిలో ప్రతిపక్ష నేత హోదా బీసీకి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకి ఆ పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. యనమల ఆ పదవి తీసుకునేందుకు సుముఖంగా లేరనే ప్రచారమూ జరుగుతోంది. ఒక్క యనమల కుటుంబానికి అగ్రతాంబూలం ఇస్తూ బీసీలందరికీ న్యాయం చేస్తున్నామనే భావన కలిగించే ప్రయత్నం ఫలించటం లేదనేది మరికొందరి వాదన. అధినేత యనమలకే ఆ అవకాశం ఇస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు బుద్దా వెంకన్న పేరు వినిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details