వ్యవ'సాయ' మేనిఫెస్టో
వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ఊతమిచ్చే పాడిపరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందించాలని అభిప్రాయపడింది. మార్చి 2 వారానికి తుది రూపు ఇవ్వాలని కమిటీ యోచిస్తోంది.
యనమల రామకృష్ణుడు అధ్యక్షతన తెదేపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ద్వితీయ సమావేశం సచివాలయంలో జరిగింది. వచ్చే ఎన్నికల ప్రణాళికలో ఏఏ అంశాలను చేర్చాలనే విషయంపై ఏడుగురు మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ ముఖ్యులతో కూడిన కమిటీ ప్రాథమిక రంగంపై ప్రధానంగా చర్చించింది.
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యమివ్వాలని సమావేశంలో పలువురు ప్రతిపాదించారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాల్సి ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. అన్నదాతలు ప్రకృతి సేద్యం వైపు మళ్లుతున్నారని, తగిన ప్రోత్సాహం ఉంటే...యువత సైతం వ్యవసాయంపై దృష్టి పెడుతుందని కమిటీ చర్చించింది. మేనిఫెస్టో కమిటీ తదుపరి సమావేశం ఈనెల 28న జలవనరుల రంగంపై నిర్వహించనున్నారు.