రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలను మరింత సమర్థవంతంగా అమలు నిర్వహించేందుకు వైద్యశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు . ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 439 వరకూ 108 అంబులెన్సులుండగా... ఇవి రోజుకూ కనీసం 1600 నుంచి 1700 మందికి సేవలు అందిస్తున్నాయి. వీరిలో గర్భిణులు 500 మంది, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు మరో 500 మంది వరకూ ఉంటున్నారు. ప్రస్తుత వాహనాలకు అదనంగా 266 వాహనాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంబులెన్స్‌ల నిర్వహణ ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి . నిబంధనల ప్రకారం 108 అంబులెన్సుల ద్వారా పట్టణాల్లో రోగులను 20 నిమిషాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి చేర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా అంబులెన్స్‌లు నిర్ణీత సమయంలో ఆసుపత్రులకు తీసుకెళ్లలేకపోతున్నాయి
108 అంబులెన్స్ సేవలు... మరింత చేరువగా - 108 vechiles
అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని త్వరితగతిన ఆసుపత్రులకు చేరవేస్తున్న 108 వాహన సర్వీసులు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. 70 వేల మందికి ఒకటి అందుబాటులో ఉండేలా అంబులెన్స్‌లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంబులెన్స్ రోజుకు నలుగురిని ఆసుపత్రులకు తరలించాలి. ఈ లక్ష్యాలను 74 శాతం వాహనాలే అందుకుంటున్నాయి. ప్రస్తుతమున్న 108 వాహనాల్లో 98 పాతవి అయినందున.... వీటితో తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విజయనగరం జిల్లాలో 34 మండలాలు ఉండగా ఒక్కో వాహనాన్ని 2 మండలాలకు వినియోగిస్తున్నారు. ఏజెన్సీల్లో అంబులెన్స్‌ల సంఖ్య మరీ తక్కువ. ఆసుపత్రులు కూడా దూరమే . ఫలితంగా ఎక్కువ మందికి సేవలు అందించటం కష్టమవుతోంది. ఏయే ప్రాంతాల్లో ఎన్ని అంబులెన్స్‌లున్నాయి.? పనితీరు ఎలా ఉంది ? ఇలాంటి అంశాలు పరిశీలించిన వైద్య శాఖ అధికారులు నూతన వాహనాలను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం 1.11 లక్షల మందికి ఒకటి చొప్పున అంబులెన్స్‌లు ఉన్నాయి. కొత్తగా 266 అంబులెన్సులు వస్తే 70 వేల మందికి ఒకటి చొప్పున అందుబాటులో ఉండనున్నాయి.