ప్రతిపక్షాలపై నిఘాపెట్టడం మాని తీవ్రవాదంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీకి హితవు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. దాడి వెనుక ఎలాంటి కుట్రలున్నా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు సచివాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఉద్యోగులకు చేసిన లబ్ధికిగాను కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ ప్రాంగణమంతా "థాంక్యూ సీఎం సార్" నినాదాలతో మార్మోగింది.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో విభేదాలు వద్దునుకున్నామని.. న్యాయపరంగా సమస్యలు పరిష్కరించుకుందామనుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించక పోవటం వల్ల సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఎవరి బెదిరింపులకు లొంగబోమన్న చంద్రబాబు.. అవసరమైతే ఆస్తులు వదులుకుంటామే తప్ప ఆత్మాభిమానం వదులుకోమన్నారు.
కష్టపడి పనిచేసి సత్తాచాటాలని ఉద్యోగులకు సీఎం పిలుపునిచ్చారు. ఇబ్బందులు, సమస్యలేమైనా ఉంటే.. వాటిని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. విధి నిర్వహణ నిమిత్తం హైదరాబాద్ వదిలి వచ్చిన ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చామని చంద్రబాబు తెలిపారు.