2021 నుంచి కృష్ణా తీరంలో గోవింద నామస్మరణ! ఏడంతస్తుల మహారాజగోపురం, ఐదంతస్తుల రాజగోపురం, ఉత్సవ మండపాలు, మాడవీధులు, కల్యాణమండపం, అద్దాల మండపంలో తిరుమలేశుడు అమరావతిలో కనిపించనున్నాడు. దేవదేవుడిని ప్రజల చెంతకే తీసుకెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చాలా చోట్ల ఆలయాలు నిర్మిస్తూ... స్వామివారి కైంకర్యాలను చేస్తారు. అలా తిరుమల క్షేత్రమే తరలివచ్చిందా? అనేలా రాష్ట్ర రాజధానిలో కృష్ణా తీరాన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం జరుగుతోంది.
25 ఎకరాల్లో కనువిందు
గతేడాది ఆగస్టు 28న అమరావతిలో 150కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టాలని అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద 25 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చోళులు, చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలిలో రూపొందించిన ఆలయ నమూనా తితిదే విడుదల చేసింది.
అద్భుత కట్టడాలు!
కాశ్యప శిల్పశాస్త్రం, మానసరం లాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఆలయ నమూనా రూపొందించారు. అడుగడునా శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా నిర్మాణం రూపుదిద్దుకోనుంది. మొత్తం 5భాగాలుగా విభజించి పనులు చేపడుతున్నారు. 36 కోట్ల వ్యయంతో అంతర ప్రాకారం పనులు మొదలుపెట్టగా... ఇప్పటి వరకు 3కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. 25 కోట్ల రూపాయలతో వెలుపలి ప్రాకార నిర్మాణం జరగబోతోంది. 37కోట్లతో ఉత్సవమండపం, ఐదంతస్తుల రాజగోపురం నిర్మించనున్నారు. అనంతరం 32కోట్ల వ్యయంతో ఆలయ ముఖద్వారం వద్ద ఏడంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, హనుమంతుడి ఆలయం, పుష్కరిణి నిర్మాణం చేపట్టాలని అంచనా వేశారు. కల్యాణ మండపం, మాడవీధుల నిర్మాణం జరగబోతున్నాయి.
అమరాతిలో ఆలయ నిర్మాణానికి ఒకటిన్నర నుంచి రెండేళ్లు పడుతుందనే అంచనాతో... రెండేళ్లకు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకుంది తితిదే. ఆ ఒప్పందం ప్రకారమే... 5 విభాగాలుగా జరుగుతున్న ఆలయ నిర్మాణం పనులు... వచ్చే ఏడాది డిసెంబర్ లేదా 2021 తొలిమాసాల్లో పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.