ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐప్యాక్... వైకాపా పవర్ ప్యాక్..! - jagan

ప్రశాంత్ కిషోర్... అలియాస్ పీకే.. నయా పొలిటికల్ గురూ..! రాజకీయ పార్టీల రాతలను మార్చేస్తానంటూ.. కొత్త ట్రెండ్ సృష్టించిన వ్యక్తి ప్రశాంత్. రాజకీయ వ్యూహకర్తగా 2014 ఎన్నికల్లో తెరపైకి వచ్చాడు. మోదీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా దేశానికి పరిచయమైన.. ప్రశాంత్ పేరు.. ఉత్తరాదిలో మారుమోగింది. ఆయన ఏర్పాటు చేసిన ఐప్యాక్ సంస్థ.. రాజకీయ పార్టీలకు సేవలందిస్తుంది. మూడేళ్ల కిందట పీకేను తీసుకొచ్చారు వైకాపానేత జగన్. ఆయన రాకతో వైకాపాలో పరిస్థితే మారిపోయింది. దారీ తెన్నూ లేని పార్టీని గాడిలోకి తేవడమే కాదు.. దానిని గెలుపు హైవేపైకి మళ్లించాడు...పీకే..!

ఐప్యాక్... వైకాపా పవర్ ప్యాక్

By

Published : May 23, 2019, 11:09 PM IST

ఐప్యాక్... వైకాపా పవర్ ప్యాక్

ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాభిమానం ఉంది... దానిని ఓట్లుగా మలిచే వ్యూహం లేదు. పవర్​ఫుల్ నేత ఉన్నాడు.. పవర్ చేజిక్కించుకునే చాణక్యం లేదు. ప్రజాభిమానాన్ని ఒడిసిపట్టి.. దానిని ఓట్లపెట్టెకు చేర్చి.. గెలుపు కుర్చీ ఎక్కాలంటే.. చాలా చేయాల్సి ఉంటుంది. ఈ విషయం 2014లో ఓడిపోయాక జగన్​కు అవగతం అయింది. అందుకే ఈసారి చాన్స్ తీసుకోలేదు. పార్టీ నేతలను నమ్ముకోలేదు. తాను ప్రచార జోరు కొనసాగిస్తుంటే.. వెనకుండి.. పార్టీ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసేలా ఓ ప్రొఫెషనల్ టీమ్​ను రంగంలోకి దించాడు.

రాజకీయ వ్యూహాల్లో జాతీయస్థాయిలో ఆరితేరిన ప్రశాంత్ కిషోర్​ను ఏరికోరి తెచ్చుకున్నాడు. పార్టీ కార్యకలాపాలను పీకేకు చెందిన ఐప్యాక్ చేతిలో పెట్టాడు. దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో వ్యూహాలను అమలు చేసిన ఐప్యాక్ ..జగన్ నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఆయన్ను గెలుపు ముంగిట నిలిపింది. వైకాపాకు అన్ని ప్రాంతాల్లో గట్టి ఓటు బ్యాంకు ఉంది. వైఎస్సార్​పై ప్రజాభిమానం మెండుగానే ఉంది. అయితే గెలవడానికి అదొక్కటే సరిపోదన్న విషయం కిందటి ఎన్నికల్లోనే తేలింది. ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును.. తటస్థ ఓట్లను రప్పించుకోవడం వైకాపా ముందున్న సవాళ్లు. అన్నింటికి మించి పార్టీని ఓ గాడిలో పెట్టడం తక్షణ కర్తవ్యం.. ఈ పనులన్నింటినీ సమర్థంగా నెరవేర్చగలిగింది పీకే టీమ్.

లక్షలాదిమంది కార్యకర్తలున్నా.. పార్టీకి బూత్ స్థాయిలో నిర్మాణమే లేకుండా పోయింది. పై స్థాయిలో ఇచ్చిన పిలుపును గ్రామస్థాయిలో జనానికి చేరవేసే బాధ్యతను నెరవేర్చింది. పార్టీకే కాదు.. జగన్ కు కూడా మేకోవర్ చేసేశాడు పీకే.. జగన్...ప్రజల్లో ఎలా నడవాలి...హావభావాలు ఎలా ఉండాలి... ప్రాంతాన్ని బట్టి ఎంతసేపు మాట్లాడాలి... అనే వరకు అన్నీ ప్రశాంత్‌ కిషోర్‌ చూసుకున్నాడు. జగన్ పార్టీకోసం.. హైదరాబాద్​లో ఒక ప్రత్యేక కార్యాలయమే ఏర్పాటు చేశారు. వివిధ దశల్లో దాదాపు 100మంది ఐపాక్ టీమ్ జగన్ కోసం పనిచేశారు. వీరు రంగంలోకి వచ్చినప్పటి నుంచి .. ఈ బృందంలో అతిముఖ్యులైన ఇద్దరు ఎప్పుడూ జగన్ వెన్నంటే ఉన్నారు.

సర్వేలతో సమాచారం..
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు పీకే.. ఐప్యాక్‌ బృందం రెండుమార్లు సర్వే చేసింది. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్రారంభమైనప్పుడు... 175 నియోజకవర్గాల్లో మొత్తం లక్షా 50వేల మంది అభిప్రాయాలు సేకరించారు. అప్పుడు వైకాపా 45 నుంచి 48 స్థానాల్లో గెలుస్తుందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మరో రెండు సర్వేలు చేయించింది పీకే టీం. మొదటి సర్వేలో 90 స్థానాలు... రెండో సర్వేలో 96 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందని ఐప్యాక్‌ బృందం నివేదిక ఇచ్చిందని తెలిసింది. ఈ నివేదికలు వచ్చాకే జగన్ ప్రశాంతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు ఎవరి ఊహకు అందని విధంగా వచ్చాయి.

నినాదాలతో జనంలోకి..
జనంలోకి సులువుగా వెళ్లేందుకు పీకే టీమ్ వినూత్న ప్రచార పంథాను ఎన్నుకుంది. రాజకీయ నినాదాలను జనంలోకి తీసుకెళ్లడంలో సిద్ధహస్తుడైన పీకే.. రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయగలిగారు. "ఒక్కచాన్స్ ఇవ్వండి.." అనిపించడం ద్వారా.. జనాలు ఆలోచించుకునేలా చేయగలిగారు. ప్రచార వ్యూహాల్లో ముందుండే తెలుగుదేశం పార్టీని అదే స్థాయిలో ఎదుర్కొన్నారు. తెదేపా బలం అంతా కూడా ఐటీ.. పబ్లిసిటీనే.. ఈసారి వైకాపా ఆ రెండింటిలోనూ.. తెదేపాని ఢీకొట్టగలిగిందంటే పీకే బృందమే కారణం. పాదయాత్రకు ముందు జగన్ ప్రకటించిన నవరత్నాలు రూపకల్పనలోనూ.. వాటిని ప్రచార చిత్రాలుగా ఎన్నికల సమయంలో జనంలోకి తీసుకెళ్లడంలో పీకే బృందం కృషి చేసింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా స్పష్టమైన సమాచారాన్ని పార్టీకి ఇవ్వగలిగింది.

ఐప్యాక్​కు జగన్ అభినందనలు...
ఐప్యాక్ బృందం తుది నివేదిక ఇచ్చాక జగన్ పీకే టీంను అభినందించారు. రెండేళ్లపాటు ఐప్యాక్‌ బృందం చాలా కష్టపడి పనిచేసిందని, వారందరికీ అభినందనలు తెలిపారు జగన్‌. ఆ సందర్భంలో జగన్‌ ఐప్యాక్‌ కార్యాలయానికి చేరుకున్న వెంటనే అక్కడి సిబ్బంది అందరూ ‘సీఎం... సీఎం..’ అని నినాదాలు చేశారు. మొత్తానికి భారీ మొత్తమే వెచ్చించి.. జగన్ పీకే ను తెచ్చుకున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ.. ఆయన చిరకాల కోరిక మాత్రం నెరవేరింది.

ABOUT THE AUTHOR

...view details