మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సోమిరెడ్డి ఆదివారం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. అమరావతిలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తొలి జాబితా ప్రకటిస్తామని చెప్పారు. షెడ్యూల్ వచ్చాక మిగతా అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో సమర్థత, పనితీరుకే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు మామూలే...
సీట్ల సర్దుబాటులో విబేధాల వల్లే కొందరు పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడిన నాయకులు నష్టపోతారని జోస్యం చెప్పారు. కొందరు స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని విమర్శించారు. అవసరం తీరాక పార్టీమారిన నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
కేసీఆర్, జగన్ కుట్రలు...
కులం పేరుతో కొందరు తెదేపాపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలని ఉద్ఘాటించారు. తెదేపాకు ప్రజల మద్దతు ఉందని గుర్తుచేశారు. తెదేపాను ఎదుర్కొనేందుకు కేసీఆర్, జగన్ హైదరాబాద్‌లో వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు.
వ్యక్తిగత నిర్ణయమే...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో మరొకరికి అవకాశం కల్పించడానికే రాజీనామా చేశానన్నారు. తెదేపాలో కుల మతాలకు ప్రాధాన్యం ఉండదని వివరించారు.