రేషన్ డీలర్లను తొలగించే ప్రతిపాదనే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తెదేపా హయాంలో అక్రమంగా నియమించిన డీలర్లు మినహా ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రేషన్ దుకాణాలపైనే నడిచిందని.. పార్టీ నడపడానికి తెదేపా నేతలు రేషన్ డీలర్ల వద్ద వసూళ్లు చేశారు అని అన్నారు. 30 వేల మందిని తొలగిస్తారంటూ తెదేపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. సీఎం జగన్.. ఉపాధి కల్పిస్తారే కానీ.. ఎవరి పొట్టకొట్టే పని చేయరు అని తెలిపారు. అడ్డదారుల్లో వచ్చిన డీలర్లు పోతారు తప్ప.. నిజాయితీగా ఉన్నవాళ్లకు ఎలాంటి భయం లేదన్నారు.లబ్దిదారుల రేషన్ కార్డులు తమ వద్ద అట్టిపెట్టుకున్న డీలర్లు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేస్తే కేసులు లేకుండా చేస్తామన్నారు. రేషన్ డీలర్లను స్టాకర్లుగా మారుస్తామన్నారు.
కేవలం రేషన్ బియ్యం అవసరమైన వారికి ప్రత్యేక కార్డులు జారీ చేయాలనే ప్రతిపాదన ఉందని... గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పౌర సరఫరాల శాఖలో అవినీతికి తావులేకుండా చేస్తామని కొడాలి నాని అన్నారు.