గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. చంద్రబాబు వాహనాన్ని విమానాశ్రయంలోనికి అనుమతించలేదు. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబుకు తనిఖీలు చేసి పంపారు. లాంజ్ నుంచి విమానం వరకు చంద్రబాబు ప్రయాణికుల బస్‌లోనే ప్రయాణించారు. వీఐపీ, జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్నా.. చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించలేదు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ తొలగించారు. ఈ పరిణామాలపై తెదేపా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే... భద్రతపరంగా శ్రేయస్సు కాదంటున్నాయి.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి: చినరాజప్ప
చంద్రబాబును ఈ విధంగా అవమానించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. 2014కు ముందు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడూ ఇలాంటి ఘటన ఎదురుకాలేదన్న చినరాజప్ప... కక్షసాధింపులో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భద్రత పట్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.