అభివృద్ధి నినాదంతోనే...
వావిలాల గోపాలకృష్ణయ్య మొదలు కిందటి ఎన్నికల్లో విజయం సాధించిన కోడెల శివప్రసాదరావు వరకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నరసరావుపేట నుంచి 5 సార్లు గెలిచిన సభాపతి కోడెల... 2014లో సత్తెనపల్లికి మారారు. కోడెల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత...నియోజకవర్గంలో అభివృద్ధి పనులు భారీ స్థాయిలోనే జరిగాయి. ఎన్నో ఎళ్లుగా ముందుకుసాగని రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టి సానుకూలత పెంచుకున్నారు. పట్టణంలో 100 పడకల ఆసుపత్రి... స్వచ్ఛ సత్తెనపల్లి పేరుతో మరుగుదొడ్లు, పట్టణంలో పరిశుభ్రత పనులు పరుగులు పెట్టించారు. గోదావరి-పెన్నా అనుసంధానానికి నకరికల్లులోనే శంకుస్థాపన చేయటం ఈ ఎన్నికల్లో ఆయనకు కలిసోచ్చేలా కనిపిస్తోంది. టిక్కెట్ విషయంలో అసమ్మతి రాగాలు గట్టిగానే వినిపించినా... టిక్కెట్ కేటాయింపు తర్వాత అన్ని సర్దుకున్నాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలుపిస్తాయని కోడెల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కోడెల సవారీనా....అంబటి ఆపరేషనా..?
పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లిలో విజయగీతం పాడేదెవరు... ?సభాపతిగా సభను నడిపించిన కోడెల మరోసారి సైకిల్‌ను పరిగెత్తిస్తారా..? లేక కిందటిసారి గట్టిపోటీనిచ్చిన అంబటి ఆపరేషన్ ఈసారి ఫలిస్తుందా..?కొత్తగా వచ్చిన గాజు గ్లాస్ చరిత్ర సృష్టిస్తుందా...?ఇంతకీ సత్తెనపల్లిలో సవారీ చేసేది ఎవరూ...? రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతున్న ప్రశ్న ఇదే!
గెలుపే లక్ష్యంగా..
కిందటిసారి ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు...ఈసారి మాత్రం సత్తెనపల్లిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. 2014లో కేవలం వందల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన... ఈఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీకి ఉన్న సంప్రదాయ సామాజిక ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే తమను గెలిపిస్తోందని అంబటి ధీమాతో ఉన్నారు.
చరిత్ర సృష్టిస్తుందా...!
మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి...జనసేన నుంచి బరిలో ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన... 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి జనసేన తరపున సీన్‌లోకి వచ్చి ద్విముఖ పోటీని త్రిముఖ పోరుగా మార్చేశారు. తెదేపా, వైకాపా గెలుపోటముల్ని ఆయన ప్రభావితం చేసే అవకాశం బలంగా ఉంది. ఈ త్రిముఖ పోటీ తెదేపాకు లాభిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో 2లక్షల 30వేల 775 ఓటర్లుండగా... అభ్యర్థుల గెలుపులో బీసీలు, మైనార్టీలు కీలకపాత్ర పోషించనున్నారు. వీటితోపాటు 3ప్రధాన సామాజిక వర్గాల ఓట్లూ గెలుపోటముల్ని ప్రభావితం చేయనున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఓటరు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.