ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు 'వెలుగు'లు.. నేడు చీకట్లు!

ఒకప్పుడు ఊరూ వాడా పెనవేసుకుంటూ పయనించిన 'పల్లె వెలుగు'... ఇప్పుడు వెంటిలేటర్​పై నడుస్తోంది! నాడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన 'ఎర్రబస్సు'... నేడు ఆర్టీసీకి భారమైపోయింది. ఆటోల తాకిడి పెరిగిపోవటం... ఆర్డినరీకి శాపంగా మారింది. గతమెంతో ఘనమైన 'తెలుగు వెలుగు'.. ప్రస్తుతం అంపశయ్యపై కాలం వెళ్లదీస్తోంది.

నాడు 'వెలుగు'.. నేడు చీకటి!

By

Published : May 17, 2019, 10:03 AM IST

'పల్లె వెలుగు'గా మనందరికీ సుపరిచితమైన ఆర్డినరీ బస్సు.. నేడు 'తెలుగు వెలుగు'గా రూపాంతరం చెందింది. కానీ తన గమనంలో మాత్రం వెలుగులు నింపుకోలేక పోయింది. గ్రామీణ ప్రాంత వాసులకు ప్రయాణ సదుపాయాలు కల్పించడంలో ఎర్రబస్సుది కీలక పాత్ర. ఊర్లను కలుపుతూ ముందుకు కదిలే ఈ బస్సు పల్లె వాసుల జీవితంతో పెనవేసుకుంటూ సాగేది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుగు ఎండనకా, వాననకా శ్రమించేది. దశాబ్దాలుగా పల్లెలతో మిళితమైన ఆ బంధం నేడు క్రమంగా తెగిపోతోంది.


ఒకప్పుడు అతిపెద్ద ఆదాయ వనరు...
కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్టీసీకి గ్రామీణ ప్రాంత సర్వీసులే అతిపెద్ద ఆదాయ వనరు. పల్లె వెలుగు వస్తేనే ఇల్లు కదిలేది. కానీ రానురాను పరిస్థితిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. ప్రధానంగా ఆటోల రాక ప్రజల జీవన విధానాన్ని మార్చేసింది. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకుల రుణాలతో పల్లెల్లో ఆటోలు పెరిగిపోయాయి. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిని అధిగమించడంలో అధికారులు విఫలమవటం ఆర్టీసీకి ప్రాణ సంకటంగా తయారైంది. ఫలితంగా ఒకప్పుడు అతిపెద్ద ఆదాయ వనరైన 'పల్లె వెలుగు'.. ఇప్పుడు ఆర్టీసీకి గుదిబండలా కనిపిస్తోంది.


నష్టాల బాటలో పయనం...
ఆర్టీసీలో 12వేల 27 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 5 వేల 786 తెలుగు వెలుగు బస్సులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల 123 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. అయితే... నష్టాల దృష్ట్యా ఇప్పటికే పలు గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిపివేసింది. క్యాట్, వనిత రాయితీ కార్డులను ఇప్పటికే రద్దు చేసింది. తెలుగు వెలుగు బస్సుల్లో డీజిల్ ఖర్చు కూడా వెనక్కి రావడం లేదని ఆర్టీసీ చెబుతోంది. తెలుగు వెలుగు బస్సులపై ఏటా 750 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. ఎంవీ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏటా మరో 316 కోట్లు చెల్లిస్తోంది. విజయవాడ, విశాఖపట్నంలో తిరిగే 1400 సిటీ బస్సుల వల్ల మరో 65 కోట్ల నష్టం వస్తోంది. డీజిల్ ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచకపోవడంతో తెలుగు వెలుగు బస్సుల్లో నష్టాలు క్రమంగా పెరుగుతున్నాయని యాజమాన్యం చెబుతోంది. కానీ.. నేటికీ తమ పల్లెలకు బస్సులు నడపాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది.

''తెలుగు వెలుగు' ఓ సేవా కార్యక్రమంతో సమానం. విద్య, వైద్యంతోపాటు ఆర్టీసీ బస్సులను సైతం పల్లెలకు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.''

ఇదీ చూడండి:గోలీ సోడా పోయే.. రంగు నీళ్లు వచ్చే

ABOUT THE AUTHOR

...view details