ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో మరోసారి సైకిల్ జోరు: ఆర్జీ ఫ్లాష్ సర్వే

మరోసారి రాష్ట్ర ప్రజలు తెదేపా వెంటే ఉన్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే తేల్చింది. ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని ఇచ్చిన ఈ సంస్థ.. పూర్తి ఆధిక్యంతో తెదేపా మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నట్టు తెలిపింది.

lagadapati

By

Published : May 19, 2019, 6:44 PM IST

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్​కు చెందిన ఆర్జీ ఫ్లాష్ టీమ్... సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపాకే ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నట్టు సంస్థ వెల్లడించింది. 175 శాసనసభ నియోజకవర్గాల్లో.. తెదేపాకు 100 సీట్లకు 10 ఎక్కువ కానీ.. 10 తక్కువ కానీ సీట్లు రావొచ్చని తెలిపింది ప్రతిపక్ష వైకాపా.. 72 స్థానాలకు 7 సీట్లు ఎక్కువ కానీ.. 7 సీట్లు తక్కువ కానీ గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతరులకు 3 స్థానాలకు 2 ఎక్కువ కానీ.. తక్కువ కానీ రావొచ్చని చెప్పింది.

లోక్​సభ ఎన్నికల్లో....

రాష్ట్రంలోని 25 లోక్​సభ నియోజకవర్గాల్లో.. తెదేపాకు ఈసారి 13 నుంచి 17 స్థానాలు దక్కొచ్చని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే తెలిపింది. వైకాపాకు 8 నుంచి 12 స్థానాలు.. ఇతరులకు 1 స్థానం రావొచ్చని అంచనా వేసింది.

ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?

శాసనసభ నియోజకవర్గాల పరంగా తెదేపాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన ఆర్జీ ఫ్లాష్ టీమ్.. ఓటింగ్ శాతంలోనూ తెదేపాకే అగ్ర తాంబూలం ఇచ్చింది. తెదేపాకు 43 నుంచి 45 శాతం ఓట్లు.. వైకాపాకు 40 నుంచి 42 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది. లోక్​సభ నియోజకవర్గాల్లో.. తెదేపాకు 43 నుంచి 45 శాతం... వైకాపాకు 40.5 నుంచి 42.5 శాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది.

పవన్ కు మూడో స్థానం

రాష్ట్రంలో త్రిముఖ పోటీ తీవ్రంగా జరిగిందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ చెప్పింది. మూడో పార్టీ కారణంగా.. తెదేపా, వైకాపాకు ఓటింగ్ శాతం తగ్గిందని.. జనసేనకు ప్రజాభిమానంలో మూడో స్థానం దక్కిందని తెలిపింది.

మరిన్ని విశేషాలు

ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ప్రకారం.. తెదేపాకు సైలెంట్ ఓటింగ్.. వైకాపాకు వోకల్ ఓటింగ్ జరగ్గా... యువతరం నుంచి జనసేనకు మంచి మద్దతు లభించింది.

తెలంగాణలో...

మరోసారి తెలంగాణలో అధికార తెరాస జోరు కొనసాగబోతోందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ చెప్పింది. లోక్​సభ ఎన్నికల్లో... 14 సీట్లు తెరాస దక్కించుకునే అవకాశం ఉందని.. కాంగ్రెస్ కు 0 నుంచి 2 సీట్లు రావొచ్చని తెలిపింది.

అంచనాలు మాత్రమే...

ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఫలితాలు చెప్పిన లగడపాటి.. ఇవి కేవలం తమ అంచనాలు మాత్రమేనని స్పష్టం చేశారు. తమ బృందం చేసిన అధ్యయనం మేరకే ఫలితాలు వెల్లడించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details