సమయం ఆసన్నమైంది ఓటరు మహాశయా... రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. విశాఖ జిల్లా అరకు, పాడేరు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు, విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 93 లక్షల మంది ఓటర్లుండగా... కోటీ 94 లక్షల మంది పురుషులు, కోటీ 98 లక్షల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా పోటీ చేస్తుండగా... 169 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 149 అసెంబ్లీ, 23 లోక్‌సభ స్థానాల్లో భాజపా... 110 అసెంబ్లీ, 11 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి.
రాష్ట్రంలో తొలిసారిగా ఓటు వేస్తున్న యువత 10 లక్షల మంది వరకు ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 46,120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. వీటిలో 9 వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి... పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను 200 మంది కేంద్ర ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించనున్నారు.
వెబ్ క్యాస్టింగ్తోపాటు వీడియో రికార్డింగ్ ద్వారా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్లు, 500 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. 85 వేల మంది పోలీసు, పారామిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి చరవాణి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరగొచ్చని ఈసీ అంచనా వేస్తోంది.