ఫొని తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర పెనుతుపానుగా కొనసాగుతోంది. తుపాను క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తీరం వైపు కదులుతోంది. గడిచిన 6 గంటలుగా 14 కిలోమీటర్ల వేగంతో తుపాను ప్రయాణిస్తోంది. ఒడిశాలోని పూరీకి 660 కి.మీ. దూరంలో, విశాఖకు 400 కి.మీ. దూరంలో.. మచిలీపట్నానికి 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరో 12 గంటల వరకు వాయవ్య దిశగా పయనించనున్న తుపాను.. తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎల్లుండి మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ వద్ద గోపాల్‌పూర్, చాంద్‌బలి మధ్య తుపాను తీరం దాటనున్నట్లు అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 200 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది.
నిశిత పరిశీలన
తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ప్రజలెవరూ తీర ప్రాంతాలకు వెళ్లొద్దని హితవుపలికింది. రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్టు పేర్కొంది. విశాఖ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీయొచ్చని వెల్లడించింది. ఉత్తరాంధ్రపై గాలుల తీవ్రత తగ్గే సూచనలు ఉన్నట్టు వివరించింది.