వక్ఫ్ పాలక మండలిని రద్దు చేస్తూ ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను.. హైకోర్టు సస్పెండ్ చేసింది . ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 22 కు వాయిదా వేసింది.
బోర్డు రద్దు.. నిబంధనల ప్రకారం తప్పు
వక్ఫ్ బోర్డు పాలక మండలి రద్దుకు సంబంధించి మైనార్టీ సంక్షేమశాఖ ఈనెల 15న రెండు జీవోలు జారీచేసింది . కొత్త పాలక మండలి ఏర్పడే వరకు రానున్న 6 నెలల వరకు రద్దు నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ నిర్ణయంతో ప్రభావితులైన సభ్యులు కె .కె .షేర్వాణి, కె.ఎం. షఫీవుల్లా తదితరులు జీవోలను సవాలుచేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ బోర్డు సభ్యులకు ఇప్పటికే ఇచ్చిన సంజాయిషీ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించగా తగిన ఉత్తర్వులు వెలువడే దశలో ఉందన్నారు. ప్రస్తుత వక్ఫ్ బోర్డు 2018లో ఏర్పడిందని.. నిబంధనల ప్రకారం ఐదేళ్లపాటు కొనసాగవచ్చని స్పష్టం చేశారు. సంజాయిషీ నోటీసుకు వివరణ ఇవ్వలేదన్న కారణంతో హడావుడిగా.. బోర్డును సర్కారు రద్దు చేసిందని ఆరోపించారు.
ఇరుపక్షాల వాదోపవాదాలు
మైనార్టీ సంక్షేమ శాఖ తరపున ఆదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ బోర్డు సభ్యుల పనితీరు బాగాలేదన్నారు. విధుల నిర్వహణలో బోర్డు విఫలమైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మౌనంగా ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. సంజాయిషీ నోటీసుకు వివరణ ఇవ్వని కారణంగా ఆరోపణలు నిజమేనని నిర్ధారణకు వచ్చిన తర్వాతే బోర్డును రద్దు చేశామన్నారు. మరోవైపు... ఏపీ వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి తరపున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ బోర్డులో ఉండాల్సిన 9 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఉన్నారన్నారు. పూర్తి వివరాల్ని కోర్టు ముందు ఉంచుతూ ప్రమాణపత్రం దాఖలు చేస్తామని అందుకు గడువు ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... బోర్డు రద్దుకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేశారు. విచారణను 22కు వాయిదా వేశారు.