పార్టీ బలోపేతమే మా లక్ష్యం: తెదేపా కాపు నేతలు - Our goal is to strengthen Tdp: Kapu leaders
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి పవన్ సహకరించకపోయినా... కలిసి ఉన్నాడనే భావనలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారని.. అందుకే ఉభయగోదావరి జిల్లాల్లో నష్టం జరిగిందని కాపు సామాజీక వర్గ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. తామంతా తెలుగుదేశంతోనే ఉంటామని స్పష్టం చేసిన ఆ నేతలు... పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పని చేస్తామని తెల్చిచెప్పారు.
పార్టీలోని కాపు సామాజిక వర్గ నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేక సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రత్యేక సమావేశాలను నిర్వహించుకుంటున్న ఆ వర్గం నేతల ఆంతర్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కాపు సామాజికవర్గానికి ఎనలేని ప్రాధాన్యం కల్పిస్తే... ఫలితాల తర్వాత ఆ వర్గం నేతలు ఆచితూచి ఉంటుండటంపై ఆరా తీశారు. ఇటివలే నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశాన్ని వీడి భాజపాలో చేరటం..., రాష్ట్రంలో బలపడేందుకు మరిన్ని వలసలను ప్రోత్సహిస్తూ కాషాయదళం పావులు కదుపుతుండటంతో తెలుగుదేశం అధినేత అప్రమత్తమయ్యారు. కాపునేతలతో ముఖాముఖి మాట్లాడి అసంతృప్తి కారణాలు తెలుసుకున్నారు. తెదేపాని విడేది లేదని... ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడతామని నేతలు వెల్లడించారు. కులాల వారీగా కూర్చుంటే తప్పు ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచినందునే గంటా, చినరాజప్ప ఈ సమావేశానికి రాలేదని నేతలు వివరించారు. జనసేన వల్ల తెదేపాకి కొంత నష్టం జరిగిందని స్పష్టం చేశారు. త్వరలోనే భవిష్తత్ కార్యచరణ సిద్ధంచేసుకుని ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలు ఎండగడుతూ ముందుకుసాగుతుమని నేతలు తెల్చిచెప్పారు.