మరో 2,3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు-పిడుగులతో కూడిన జల్లులు ఓ వైపు తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా గరిష్ట స్థాయిలోనే నమోదు అవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం 41 నుంచి 43 డిగ్రీల మధ్య...
ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో ని కడప, కర్నూలు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అటు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
మళ్లీ వేడెక్కనున్న వాతావరణం...
గడచిన వారం రోజులతో పోలిస్తే స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గినా.. ఈ నెల 15 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరో 2,3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత 47 డిగ్రీలకు మించే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేస్తోంది.
పిడుగులతో కూడిన వర్ష సూచన...
మరోవైపు తీవ్రస్థాయికి చేరిన ఉష్ణోగ్రతల కారణంగా చాలా చోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ స్ఫష్టం చేసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి-వర్షాలు కురవాలి.. దేశం సుభిక్షంగా ఉండాలి!