సార్వత్రిక సమరానికి సమయం దగ్గర పడింది. ప్రచారానికి పది రోజుల సమయమే ఉంది. ఇప్పటికే ఊరూవాడా చుట్టేస్తున్న ప్రధాన పార్టీలు.. ఉన్న తక్కువ సమయంలో జనానికి మరింత దగ్గరయ్యేందుకు వీలైనంతగా.. విస్తృతంగా.. వినూత్నంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో.. ప్రచారానికి జాతీయ స్థాయి ప్రముఖులను, తమ తమ పార్టీల పెద్దలను రప్పిస్తూ.. ప్రజలను తమవైపు ఆకర్షితులను చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆదివారం రాష్ట్రంలో 2 కీలక బహిరంగ సభలు.. జాతీయ అగ్ర నాయకుల సమక్షంలో జరగనున్నాయి.
మమత వచ్చేస్తున్నారు
అధికార తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రాష్ట్రానికి రప్పించింది. బహిరంగ సభల్లో తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించింది. ఆదివారం విశాఖలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. విశాఖ వేదికగా జరగనున్న ఈ పసుపు ప్రచార పండగకు.. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు.. కేజ్రీవాల్ హాజరుకానున్నారు. తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం చేయనున్నారు.
తెదేపాకు పోటీగా కాంగ్రెస్
కాంగ్రెస్ నేతలు కూడా తామేమీ తక్కువ కాదని చాటుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో కోల్పోయిన పట్టును.. తిరిగి సంపాదించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో అధికారంపై అంతగా ఆశలు పెట్టుకోని ఆ పార్టీ.. కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే రాహుల్ తొలి సంతకమని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మరోసారి రాహుల్‌ను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఆదివారం.. నవ్యాంధ్ర రాజధాని కొలువైన విజయవాడ పట్టణంలో రాహుల్ సమక్షంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి.
1న రాజమహేంద్రవరానికి మోదీ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అభాసుపాలైన భాజపా... ఎన్నికలతో ఉనికి చాటుకునేందుకు ఆరాటపడుతోంది. ఇటీవల గుంటూరు, విశాఖ, కర్నూలులో ప్రధాని మోదీతో బహిరంగ సభలు నిర్వహించింది. ఏప్రిల్ 1న మరోసారి రాష్ట్రానికి మోదీ వస్తున్నారు. రాజమహేంద్రవరంలో భాజపా బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం.. ఏప్రిల్ 3న తాడేపల్లిగూడెం, విజయనగరంలో సభలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 4న నరసరావుపేట సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. అదే రోజున విశాఖలో భాజపా రోడ్ షోకు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరవుతారు. ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో భాజపా ప్రచారానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరే కాక.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఇటీవలే భాజపా రాష్ట్ర మేనిఫెస్టో విడుదల చేసిన పీయూష్ గోయల్.. భాజపా ప్రచారానికి రానున్నట్టు తెలుస్తోంది.
పది రోజులు.. ప్రచార హోరే!
ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 9తో ప్రచారం ముగియనుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీలకు ఇంకా 10 రోజుల సమయమే ఉంది. ఇంత తక్కువ వ్యవధిని.. వీలైనంతగా ఉపయోగించుకుంటూ.. తమ వాణిని వినిపించుకునేందుకు ప్రధాన పార్టీల నుంచి మొదలు.. చిన్నా చితకా పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాష్ట్రాన్ని ప్రచారంతో హోరెత్తించనున్నాయి.