ఆంధ్రప్రదేశ్‌లోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ ముగిసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 5,064 మంది ఓటర్లు ఉండగా, 4,126 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 1990మంది పురుషుల కాగా, 2,136 మంది మహిళలు. మెుత్తం 81.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీపోలింగ్ జరిగిన ఐదు కేంద్రాల్లో ఎక్కడ కూడా ఈవీఎంలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా నరసరావు పేట పరిధిలోని కేశనపల్లి కేంద్రంలో అత్యధికంగా 89.23శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పరిధిలోని కలనూతల కేంద్రంలో మినహా మిగతా అన్ని చోట్ల ఆరింటికే ఓటింగ్ ముగిసింది.
ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు నేటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఓట్ల లెక్కింపు చేపట్టే సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందిని రెండు దశల్లో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామని వివరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు లెక్కించేందుకు 180 మంది సిబ్బంది అవసరం ఉందన్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 25 వేల మంది సిబ్బంది అవసరమన్న ద్వివేది... ఏ ఉద్యోగి ఏ నియోజకవర్గం ఓట్లు లెక్కిస్తారో ఈనెల 23న తెలుస్తుందన్నారు.
ఏం చేయాలో అధికారులే నిర్ణయించుకోవాలి....
ఎన్నికల వేళ ఏం చేయాలో, ఏం చేయకూడదో తాము అధికారులకు చెప్పడం లేదని ద్వివేది అన్నారు. అధికారులకు నియమావళి పుస్తకాలను అందించామని, వాటిని చదవి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా సందేహం ఉంటే , అధికారికంగా లేఖ రాస్తే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి స్పష్టత తీసుకుంటామన్నారు. గ్రూప్-2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు ఇచ్చిన దాని పై ఫిర్యాదు వచ్చిందని, ఈ విషయంపై నివేదిక తెప్పిస్తామని చెప్పారు.