అందరికంటే ముందే మేల్కొని... చివరగా పడుకుంటుంది. రోజంతా కష్టపడుతుంది. స్వార్థం లేని సేవలందిస్తుంది. అందుకే ఆమె అందరికి అమ్మ అయింది. మాతృమూర్తి రుణం తీర్చుకోవాలంటే ఈ జన్మ సరిపోదు.. అమ్మకే అమ్మగా పుడితే తప్ప. ఇంతలా కష్టపడే అమ్మకు మన వంతుగా ఆదివారం సెలవిద్దామా...!
అమ్మంటే అందరికీ ఇష్టమే... అయినా తన మనసులోని భావాలను అర్థం చేసుకోం... సమయానికి మాత్రం కావాల్సినవి మన ముందుండాల్సిందే. కొంచెం ఆలస్యమైనా అరుస్తాం.. అలుగుతాం.. అంతేనా నేను తినను పో.. అని బెదిరిస్తాం. అది విన్న అమ్మ నా బిడ్డ తినకపోతే ఎలా అని ఆవేదన చెందుతుంది. వెంటనే అడిగింది తెచ్చిపెడుతుంది.
ఇంట్లో వారందరూ తిన్న తర్వాత తింటుంది. బిడ్డ తినకపోతే అల్లాడిపోతుంది. పిల్లలు ఏదైనా కావాలంటే మొదట అమ్మనే అడుగుతారు. నువ్వే ఏలాగైనా నాన్నకు చెప్పాలని వేడుకుంటారు. తల్లి... అటు భర్తకు, ఇటు పిల్లలకు మధ్య వారధిగా ఉంటుంది. అంతేనా... నీకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తుంది.