ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శాసనమండలి సభ్యులు సైతం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహాం చూపిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవిధంగా తెదేపా ప్రణాళికలు రచిస్తోంది.
గేరు మార్చిన లోకేశ్..
గత ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకే పరిమితమైన లోకేశ్..ఎమ్మెల్సీగానే మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ..ప్రజల్లో తనదైన ముద్ర వేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి..ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే లోకేశ్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కొత్త ముఖం కిడారి..ప్రత్యక్షంగానే
అనూహ్య పరిణామాలతో మంత్రి అయిన కిడారి శ్రావణ్..అరకు స్థానంలో బరిలోకి దిగనున్నారు. బోధన రంగం నుంచి రాజకీయాల్లో తనశైలిని ప్రదర్శిస్తోన్న మంత్రి పి.నారాయణ నెల్లూరు (నగరం) నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి సీటు ఖరారైంది.
యనమల సోదరులూ...
సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవీకాలం మార్చితో ముగుస్తుంది. పోయినసారి ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు తుని స్థానంలో పోటీచేసి...వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి ఎలాగైనా తుని నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని తెదేపా అధిష్ఠానం భావిస్తోన్న తరుణంలో... యనమల సోదరుల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనేది అప్పుడే చెప్పలేం.
మిగిలిన వారిది అదేబాట
- రెండు నెలల క్రితమే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్. కర్నూలు జిల్లాలో రాజీకీయ పరిస్థితుల నేపథ్యంలో...ఆయనపై అధినేత వైఖరి ఎలా ఉండబోతున్నదనే విషయం ఆసక్తిగా మారింది.
- ఇప్పటికే కడప జిల్లా జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి ఖరారైన విషయం తెలిసిందే.
- మండలి చీఫ్ విప్ పయ్యావులకు అనంతపురం జిల్లా ఉరవకొండ టికెట్ మరోసారి ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.
- 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిన మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ..ఒంగోలు నుంచే లోక్సభకు పోటీ చేయించాలని పార్టీ యోచిస్తోంది.
- వేడెక్కిన చీరాల రాజకీయాల్లో తెదేపా శాసనసభ అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణం బలరాం ఉన్నారు.
- కిందటి ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానంలో ఓటమి చవిచూసిన ఎమ్మెల్సీ సంధ్యారాణి..విజయనగరం జిల్లా సాలూరు ఎస్టీ రిజర్వడ్ సీటును ఆశిస్తున్నారు.