ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుభవం... విధేయతకు అవకాశం - మంత్రివర్గం

ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు ఎక్కువగా అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది. మొత్తం 25 మంది ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

జగన్‌ మంత్రివర్గం

By

Published : Jun 8, 2019, 6:09 AM IST

శ్రీకాకుళం జిల్లా ...
‍శ్రీకాకుళం జిల్లా నరనన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్​ను మంత్రిపదవి వరించింది. బీకాం పూర్తి చేసిన ధర్మాన కృష్ణదాస్... ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున.. 2012లో జరిగిన ఉపఎన్నికలో వైకాపా తరపున గెలిచారు.

విజయనగరం జిల్లా ...
విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణకు అమాత్య యోగం దక్కింది. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్​కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ బొత్స మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా... ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కురుపాం నుంచి గెలుపొందిన పాముల పుష్పశ్రీవాణికి మంత్రిపదవి లభించింది. బీఎస్సీ, బీఈడీ విద్యనభ్యసించిన పుష్ప శ్రీవాణి... ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 33 సంవత్సరాలకే అమాత్య యోగం దక్కింది.

విశాఖ జిల్లా...
విశాఖ జిల్లా భీమిలి నుంచి శాసన సభ్యుడిగా గెలుపొందిన ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను మంత్రిపదవి వరించింది. ఇంటర్మీడియెట్ చదివిన ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు... అవంతి శ్రీనివాస్‌గా గుర్తింపు ఉంది. ఆయన ఇప్పటివరకు ఒకసారి అనకాపల్లి ఎంపీగా.... రెండుసార్లూ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తూర్పుగోదావరి జిల్లా...
జిల్లా నుంచి సీనియర్ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సుభాష్‌ చంద్రబోస్​కు జగన్ కేబినెట్​లో చోటు కల్పించారు. సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరున్న సుభాష్ చంద్రబోస్‌.... వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుచరుడు. 2004లో గెలుపొంది వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2012 ఉపఎన్నికలో ఓడిపోయారు. అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పినిపె విశ్వరూప్‌...1987లో రాజకీయ ప్రవేశం చేశారు. 2004లో తొలిసారి ముమ్మడివరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2010 వరకు గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా పని చేశారు. 2010 నుంచి 2013 వరకు పశుసంవర్ధకశాఖ, పాడిపరిశ్రమ, మత్స్య, శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కాకినాడ గ్రామీణం నుంచి గెలుపొందిన కురసాల కన్నబాబు... జగన్‌ జట్టులో స్థానం సాధించారు. జర్నలిస్ట్‌గా పని చేసిన కన్నబాబు... 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 తర్వాత వైకాపాలో చేరి కాకినాడ గ్రామీణం నుంచి గెలుపొందారు.

పశ్చిమ గోదావరి జిల్లా...
ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచిన... ఆళ్ల నానికి జగన్ కేబినేట్​లో చోటుదక్కింది. ఈయన పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. బీకాం చదువుకున్న ఆళ్ల... ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2012 ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా విజయం సాధించారు. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు అమాత్యయోగం దక్కింది. ఇంటర్ చదువిన శ్రీరంగనాథరాజు 2004 అత్తిలి నుంచి తొలిసారి గెలుపొందారు. తాజాగా వైకాపా తరపున ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం జిల్లా రైసు మిల్లర్ల సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. కొవ్వూరు నుంచి గెలుపొందిన తానేటి వనిత... జగన్ జట్టులో స్థానం సాధించారు. 2009లో గోపాలపురం నుంచి పోటీచేసి... తొలిసారి విజయం సాధించారు. వైకాపా ఏర్పాటు తర్వాత జగన్​తో కలిసి పనిచేశారు.

కృష్ణా జిల్లా...
కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని‍‌కి జగన్ జట్టులో చోటు దక్కింది. తనకు అండగా ఉంటూ... అందించిన సేవలను గుర్తించిన జగన్... నానికి అమాత్య పదవిని కట్టబెట్టారు. 2012లో జగన్​కు జై కొట్టిన కొడాలి... 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి గెలుపొందిన పేర్ని నానికి మంత్రివర్గంలో చోటు దక్కింది. పేర్నికి అందరికీ అందుబాటులో ఉంటారనే పేరుంది. 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి నుంచీ తన కుటుంబానికి అండగా ఉన్న పేర్నినానికి... జగన్ మంత్రి పదవి ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెల్లంప్లలి శ్రీనివాస్​కు... మంత్రి పదవి లభించింది.

గుంటూరు జిల్లా...
జిల్లాలో సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను మరోసారి మంత్రి పదవి వరించింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా... ఆయనకున్న అనుభవం దృష్ట్యా అమాత్య యోగం దక్కింది. 1999, 2004, 2009లో మోపిదేవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి రెండుసార్లు కూచినపూడి నుంచి, 2009లో రేపల్లె నుంచి గెలుపొందారు. రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేకతోటి సుచరిత... జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. సుచరిత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006లో రాజకీయ ప్రవేశం చేసిన సుచరిత... 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్ మరణం తదనంతర జగన్ వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ మహిళ కావడంతోపాటు... విద్యావంతురాలు కావడం వల్ల... మంత్రివర్గంలో అవకాశం వచ్చింది.

ప్రకాశం జిల్లా...
ఒంగోలు నుంచి గెలుపొందిన బాలినేని శ్రీనివాసరెడ్డిని మరోసారి మంత్రి పదవి లభించింది. 1999, 2004, 2009, 2012, 2019లో ఆయన ఒంగోలు స్థానం నుంచి విజయం సాధించారు. వైఎస్ హయాంలో భూగర్భ, ఖనిజ, చేనేత జౌళి శాఖలు నిర్వహించిన బాలినేని... 2012లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. అనుభవం, వివాద రహితుడు, మృదుస్వభావి కావడం బాలినేనికి కలసి వచ్చింది. యర్రగొండపాలెం నుంచి గెలుపొందిన ఆదిమూలపు సురేశ్‌ జగన్‌ జట్టులో దక్కించుకున్నారు. రాజశేఖర రెడ్డి అనుచరుడిగా... విద్యావేత్తగా పేరున్న సురేశ్‌... జగన్‌కు అత్యంత ఆప్తుడు.

నెల్లూరు జిల్లా...
ఆత్మకూరు నుంచి విజయం సాధించిన మేకపాటి గౌతంరెడ్డి... జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గౌతంరెడ్డి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మేకపాటి గౌతంరెడ్డికి... జగన్​తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ పెట్టకముందు నుంచే జగన్​కు వెన్నుదన్నుగా నిలిచిన వారిలో గౌతంరెడ్డి ఒకరు. నెల్లూరు నగరం నుంచి గెలుపొందిన అనిల్ కుమార్ జగన్ జట్టులో స్థానం సంపాదించారు. 2008లో నెల్లూరు కార్పొరేటర్​గా గెలిచిన అనిల్‌... 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నిక్లలోనూ విజయం సాధించి... మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

కర్నూలు జిల్లా...
డోన్ నుంచి విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన బుగ్గన... 2014, 2019లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీఏసీ ఛైర్మన్​గా పనిచేసిన అనుభవం ఉంది. ఆలూరు నుంచి గెలుపొందిన గుమ్మనూరు జయరాంను మంత్రి పదవి వరించింది. 2006లో జట్పీటీసీ సభ్యుడిగా గెలిచిన జయరాం... 2014లో తొలిసారి వైకాపా తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో... కోట్లసుజాతమ్మపై విజయం సాధించి.. కేబినేట్​లో చోటు దక్కించుకున్నారు.

కడప జిల్లా...
కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన అంజద్ బాషాకు జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కింది.
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అంజద్‌ బాషా... 2019లోనూ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. సౌమ్యుడనే పేరుతోపాటు... పార్టీ ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా అంజద్ బాషా ముందుండి పనిచేశారు.

అనంతపురం జిల్లా...
పెనుకొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శంకరనారాయణకు జగన్ మంత్రివర్గంలో చోటు లభించింది. సౌమ్యుడిగా పేరున్న శంకర నారాయణ... ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ మెంబర్​గా... ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్సార్ మరణం తరువాత... జగన్ వెంట నడిచారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి దక్కించుకున్నారు.

చిత్తూరు జిల్లా...
పుంగనూరు నుంచి గెలుపొందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మరోసారి మంత్రి పదవి వరించింది. ఈయన ఇప్పటివరకు ఆరుసార్లు... ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజశేఖరరెడ్డి హయాంలోనూ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జగన్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. గంగాధర నెల్లూరు నుంచి విజయం సాధించిన నారాయణస్వామికి మంత్రి పదవి దక్కింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణస్వామి... 2004లో సత్యవేడు నుంచి... 2014, 2019లో గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details