ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 24, 2019, 6:58 AM IST

Updated : Mar 24, 2019, 11:24 AM IST

ETV Bharat / state

కర్నూలు కోటపై ఎగిరే జెండా ఎవరిది..?

కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఎవరిది..? కర్నూలు కోట కోట్ల కుటుంబానిదేనా..? ప్రతిపక్ష వైకాపా పాగా వేయగలుగుతుందా..? కాకలు తీరిన కోట్ల సూర్యప్రకాశరెడ్డిని నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన సంజీవ్​కుమార్ ఎదుర్కోగలరా.. ? రాయలసీమ ముఖద్వారంగా ఉండే కర్నూలు పార్లమెంట్ స్థానంపై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.

కర్నూలు కోటపై ఎగిరే జెండా ఎవరిది..?

ఒకనాటి హస్తం కోటకు బీటలువారాయి. విభజన అపవాదును మూటగట్టుకున్న ఆ పార్టీ కంచుకోట ఇతరుల వశమైపోయింది. అదే సీమ గడ్డలోని కర్నూలు పార్లమెంట్ స్థానం. 2014 ఎన్నికల్లో ఇక్కడ ఫ్యాన్ గాలి వీస్తే..సైకిల్ పరుగు పెట్టడంలో కాస్త వెనుకబడింది. ఈసారి కొండారెడ్డి కోటను కొట్టేందుకు గట్టి అభ్యర్థితో బరిలోకి వచ్చింది. కర్నూలు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న కోట్ల కుటుంబం నుంచి సూర్యప్రకాశ్ రెడ్డిని తెదేపా అభ్యర్థిగా బరిలోకి దింపి పోరుకు సై అంది. వైకాపా బీసీ అభ్యర్థి సంజీవ్​కుమార్ ని తమ గెలుపుగుర్రంగా పోటీలో నిలిపింది.

కర్నూలు కోటపై ఎగిరే జెండా ఎవరిది..?


కోట్ల కుటుంబం... 9 / 16
కర్నూలు పార్లమెంట్ స్థానంలో ఎప్పుడూ హస్తం పార్టీదే హవా... ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే...9 సార్లు కోట్ల కుటుంబమే కోటపై జెండా ఎగరేసింది. 6 సార్లు దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గెలిస్తే...ఆయన కుమారుడు 3 సార్లు విజయం సాధించారు. తెదేపా కేవలం 2 సార్లు గెలవగా.. కిందటి ఎన్నికల్లో వైకాపా గెలించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోట్ల.... లక్షకు పైగా ఓట్లు సాధించి తన బలమేంటో చూపించారు.

ఆమెకు నై...కోట్లకు సై

2014లో వైకాపా తరపున గెలిచిన బుట్టా రేణుక .అనంతరం తెదేపాలో చేరారు. కర్నూలు ఎంపీ టిక్కెట్ తనకే వస్తుందని భావించారు. కానీ కాంగ్రెస్​పార్టీకి కేరాఫ్​గా ఉండే కోట్ల కుటుంబం...ఊహించని రీతిలో తెలుగుదేశంలో పార్టీలో చేరింది. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే....కర్నూలు లోక్​సభ టిక్కెట్ దక్కింది. ఈ దశలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బుట్టా...భవిష్యత్తు గందరగోళంలో పడింది...జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీటు కేటాయిస్తారని చూసినా..ఆ పరిస్థితీ లేకపోవడంతో ఆమె తిరిగి సొంత గూటికి చేరిపోయారు. అక్కడ కూడా ఆమెకు నిరాశ తప్పలేదు. బీసీ కోటాలో...వైద్యుడైన సంజీవ్ కుమార్ ను బరిలోకి వైకాపా పార్టీ టికెట్ కేటాయించింది. . భాజపా నుంచి వైద్యుడైన పార్థసారధి, జనసేన మద్దతుతో సీపీయం అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి, హస్తం తరపున అహ్మద్ ఖాన్ లు పోటీలో ఉన్నారు.

కరవే సమస్య

చుట్టూ నదులు ప్రవహిస్తున్నా.. కర్నూలు నియోజకవర్గంలో చాలా ప్రాంతంలో కరవు తాండవిస్తుంటుంది. ఈ ప్రాంతంలో దుర్భిక్షాన్ని పారద్రోలాలంటే..గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడికాల్వ, ఎల్​ఎల్​సీకి పైప్ లైన్ పనులు చేపట్టాలన్న డిమాండ్లు తరతరాలుగా ఉన్నాయి. తెదేపా ప్రభుత్వం ఈ మధ్యనే ఈ 4 ప్రాజెక్టులను మంజూరు చేస్తూ...జీవోలు విడుదల చేసింది. దీంతో జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు...వ్యక్తిగత ఇమేజ్ తో కర్నూలును కైవసం చేసుకుంటామని కోట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటంలో తెదేపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. వీటికి తోడు పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ కుమార్ చెబుతున్నారు.

కర్నూలు కోటపై పసుపు జెండాను ఎగరవేయాలని చూస్తోన్న తెదేపాను ప్రజలు ఆదరిస్తారా...లేక వైకాపా నవరత్నాలను స్వాగతిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Last Updated : Mar 24, 2019, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details