ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలిలో ఎగురుకుంటూ వచ్చిన "కిమ్" కారు.. కథేంటో తెలుసా..? - konow the facts of north korea president "Kim" car flying in the air

ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉంటాయి. తాజాగా ఆయన వాడుతున్న బెంజి కారు కథ వెలుగులోకి వచ్చింది. ఇది వింటే పెద్దపెద్ద స్మగ్లర్లు కూడా మూర్ఛపోవాల్సిందే. ఉపగ్రహాల నిఘా కళ్లుగప్పి.. సముద్రాలు దాటించి .. విమానాల్లో ఎక్కించి మరీ కిమ్ కు కార్లను చేర్చారు. ఆ కథేంటో తెలుసుకుందామా..?

గాలిలో ఎగురుకుంటూ వచ్చిన "కిమ్" కారు.. కథేంటో తెలుసా..?

By

Published : Jul 17, 2019, 4:49 PM IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అందరికీ తెలిసిందేగా.. మహా డేంజర్​మ్యాన్. అగ్రరాజ్యాల కళ్లుగప్పి.. అణుపరీక్షలు జరిపిస్తుంటాడు.. గుట్టుచప్పుడు కాకుండా.. గూఢచారులను మట్టుబెట్టిస్తుంటాడు... అలాంటి వ్యక్తి.. ఎప్పుడు చూసినా రాజధాని ప్యాంగ్ యాంగ్​లో విలాసవంతమైన బెంజ్ లిమోసిన్ , రోల్స్​రాయిస్ వంటి కార్లలో కనిపిస్తుంటాడు.. ఆ ఫోటోలు చూసి.. పాశ్చాత్య నిఘా సంస్థలు ఖంగుతినేవి.. దాదాపు అన్నీ దేశాలతో తగువులున్న ఉత్తరకొరియా మీద ఆంక్షలు ఎక్కువ..! అయినా ఇంత విలాసవంతమైన కార్లు కొరియాకు ఎలా వచ్చాయన్నది ఎవరికీ అంతుబట్టేది కాదు. దీంతో అమెరికాకు చెందిన ది సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అనే ఒక సంస్థ పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధనలో కిమ్‌కు కార్లను తరలించడం వెనుక ప్రపంచ స్థాయిలో పెద్ద నెట్‌వర్కే పనిచేసిందది తేలింది.

సముద్రాలను దాటి ..
కిమ్‌కు చేరాల్సిన రెండు మెర్సిడెస్‌ కార్లను 2018 జూన్‌ 14వ తేదీన రెండు కంటైనర్లలో లోడ్‌చేసి వాటికి సీల్‌ వేసి ట్రక్కుల్లో నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌ ఓడరేవుకు చేర్చారు. వీటి విలువ 5లక్షల డాలర్లు ఉంటుంది. ఈ కార్లు చైనాకు చెందిన ఓ షిప్పింగ్‌ కార్పొరేషన్‌ కస్టడీలో ఉన్నాయి. తొలుత ఈ కార్లను ఎవరి పేరుతో కొన్నారో తెలియలేదు. రోటర్‌డామ్‌ నుంచి బయల్దేరిన ఆ కార్గో షిప్‌ 41రోజుల తర్వాత జులై 31న చైనాలోని దలియన్‌ ఓడరేవుకు చేరింది. అక్కడ ఆ కంటైనర్లను దించేశారు. అవి ఆగస్టు 26వరకు ఆ పోర్టులోనే ఉండిపోయాయి. జపాన్‌లోని ఒసాక వెళ్లే ఒక షిప్‌లో వాటిని లోడ్‌ చేశారు. సెప్టెంబర్‌ 18 నాటికి ఒసాక చేరిన ఈ కంటైనర్లను బుసాన్‌ వెళ్లే మరో ఓడలో ఎక్కించారు. సెప్టెంబర్‌ 30న ఇవి దక్షిణకొరియాలోని బుసాన్‌ ఓడరేవును చేరాయి.

అక్కడే అసలు మతలబు..

ఉత్తర ఆఫ్రికా దేశమైన టోగో పతాకంతో ఉన్న డీఎన్‌5505 ఓడ బుసాన్‌లో ఈ కంటైనర్లను ఎక్కించుకొని రష్యాలోని వ్లాదివాస్తోక్‌ వద్ద నఖోద్క ఓడరేవు దిశగా బయల్దేరింది. ఉత్తరకొరియాకు వెళ్లే స్మగ్లింగ్‌ వస్తువులకు ఈ ప్రాంతం గడప వంటింది. అక్టోబర్‌ 1వ తేదీన ఈ షిప్‌ ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థను నిలిపివేశారు. ఆంక్షలను ఉల్లంఘించడానికి నౌకలు సాధారణంగా ఇదే పనిచేస్తాయి. 18 రోజుల తర్వాత దక్షిణ కొరియా సముద్ర జల్లాల్లో ఈ ఓడ సిగ్నల్స్‌ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో దానిలో 2,588 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉంది. దీనిని దక్షిణ కొరియాలోని ఫాంగ్‌ నౌకాశ్రయంలో అన్‌లోడ్‌ చేసింది. రష్యా నుంచి ఈ బొగ్గును తెచ్చినట్లు చూపించారు.

ఉ.కొరియా నుంచి మూడు విమానాలు..
అక్టోబర్‌ 7వ తేదీన ఉత్తరకొరియాకు చెందిన మూడు కార్గో విమానాలు రష్యాలోని వ్లాదివాస్తోక్‌కు చేరుకొన్నాయి. ఇది చాలా అరుదైన ఘటన. ఇవే విమానాలు కిమ్‌ విదేశీ పర్యటనలకు కార్లను తరలిస్తాయి. అదే రోజున అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మైక్‌ పాంపియోతో భేటీ అయ్యేందుకు కిమ్‌ ఒక రోల్స్‌రాయిస్‌ను బయటకు తీయడం విశేషం. వ్లాదివాస్తోక్‌ చేరుకొన్న ఉత్తరకొరియా విమానాలు బెంజ్‌ లిమోసిన్‌లను లోడ్‌ చేసుకొని ప్యాంగ్‌యాంగ్‌ దిశగా రివ్వున ఎగిరిపోయాయి. జనవరి 31న ఆ బెంజి కార్లలో కిమ్‌ ఠీవీగా ప్యాంగ్‌యాంగ్‌ వీధుల మీదుగా తన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

అంతా ఓ ఓడలోనే..!
ఈ ఓడ మార్షల్‌ ఐలాండ్‌కు చెందిన డూ యంగ్‌ షిప్పింగ్‌ కంపెనీ పేరుతో రిజిస్టరై ఉంది. రష్యాకు చెందిన డేనియల్‌ కజచుక్‌ ఈ కంపెనీ యజమానిగా భావిస్తున్నారు. కిమ్‌ కార్లను రవాణ చేసిన ఓడను ఇంతకు ముందు హంగ్‌కాంగ్‌లోని ఒక కంపెనీ వాడింది. అప్పట్లో దానిపేరు జింగ్‌ జిన్‌.. తర్వాత డీఎన్‌5505గా మార్చారు. కార్లు చైనాలోని ఓడరేవుకు చేరడానికి కొన్ని రోజుల ముందే పేరు మార్చారు. ఆ తర్వాత డూయంగ్‌కు చెందిన నౌకలను దక్షిణ కొరియా అదుపులోకి తీసుకొంది.

శత్రుదేశాల నుంచే సాయం..
జపాన్‌, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌ వంటి అమెరికా మిత్రదేశాల గుండా ఈ కార్లు రవాణా అయ్యాయి. దీనిని బట్టి చూస్తే.. ఉత్తరకొరియాకు తమ శత్రుదేశాల్లో కూడా ఎంతబలమైన నెట్​వర్క్ ఉందో అర్థమవుతుంది. 2015-17 మధ్యలో కిమ్‌ బృందం 90 దేశాల నుంచి విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకొన్నట్లు అంచనా. ఇలాంటి మార్గాల్లోనే ఉ.కొరియా అణు టెక్నాలజీ, ఇంధనాలను తెప్పిస్తున్నట్లు అమెరికా విశ్వసిస్తోంది. ఉ.కొరియా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, దక్షిణ కొరియా అధినేత మూన్‌జే ఇన్‌ కూడా ఈ అక్రమ కార్లలోనే విహరించారు. ఆ కార్లు ఎలా వచ్చాయో.. వారికి తెలుసు.. కానీ కిక్కురుమనలేరు కదా..!

ఇదీ చదవండీ... ట్రంప్​కు మరోమారు అభిశంసన చిక్కులు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details