ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి హోదాలో కీలక ప్రకటనకు అవకాశం..! - swering

రేపు విజయవాడలో జరగనున్న వైఎస్ జగన్  ప్రమాణ స్వీకారానికి  ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.  కార్యక్రమానికి ప్రముఖులు సహా నేతలు, పెద్దఎత్తున కార్యకర్తలు తరలి రానుండటంతో ఆమేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితులపై  అధికారులతో  ఇప్పటికే చర్చించిన జగన్... ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

వైఎస్ జగన్

By

Published : May 29, 2019, 5:49 AM IST

నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హాజరు కానున్నారు.గవర్నర్, ఇతర ప్రముఖులు ,పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ,నేతలు సహా పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం , డీజీపీ ఆర్పీ ఠాకూర్ , కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ తిరుమలరావు సహా పలు విభాగాల ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైఎస్ జగన్
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ముందు విస్త్రృతంగా ప్రచారం చేసిన నవరత్నాలు ఎప్పటి నుంచి అమలు పరుస్తారనే విషయమై జగన్ ప్రకటన చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికాంశాల్లో క్రమశిక్షణపైనా ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ప్రమాణస్వీకారం రోజున చేయాల్సిన ప్రకటనలపై ఇప్పటికే మాజీ సీఎస్ అజయ్ కల్లంతో వైఎస్ జగన్‌ సమావేశమై చర్చించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సైతం శాఖలవారీగా సంక్షిప్త సమాచారాన్ని జగన్‌కు అందించారు. పోలవరం ప్రాజెక్టు విషయంపైనా ఇద్దరి మధ్య ప్రత్యేక చర్చ జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల వివరాలను కాబోయే సీఎంకు అందించారు. అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి ఇబ్బందుల్లో ఉన్నందున..మరిన్ని ఇబ్బందులు రాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని జగన్‌కు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం పూర్తయ్యాక జూన్ 1 నుంచి 5 వరకు సీఎం హోదాలో శాఖల వారీగా జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయాలను అమలు చేసే అవకాశముంది. తన పాలన ఎలా ఉంటుంది. ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిని గాడిన పెట్టేందుకు తీసుకోబోయే చర్యలు సహా సంక్షేమ పథకాలు, ఉద్యోగాల ప్రకటన సహా మానిఫెస్టోలో ప్రకటించిన పలు హామీలను అమలు పై జగన్ ప్రమాణ స్వీకార వేదికగా ముఖ్యమంత్రి హోదాలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details