సముద్రంలో వృథాగా పోతున్న గోదావరి జలాలను వీలైంత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు....అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు తెలిసింది. ప్రాణహిత ద్వారా ఎంత నీరు వస్తుంది..? కాళేశ్వరం ద్వారా మళ్లించే నీరెంత.? ఇంద్రావతి నదిలో ఉండే ప్రవాహం ఏంటి.. అన్న విషయాలపై కేసీఆర్, జగన్ చర్చించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత... ఆ నీటిని శ్రీశైలం జలాశయానికి మళ్లిస్తే కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేయోచ్చని జగన్‌కు కేసీఆర్ సూచించారు. అయితే ఈ పథకాన్ని ఇరు రాష్ట్రాలు కలిసి చేపట్టాలా?, రాష్ట్ర ప్రభుత్వమే చేపడితే తెలంగాణ ప్రభుత్వం సహకరించడమా అన్న విషయంలో స్పష్టత రాలేదు.
ఈ పథకాన్ని తక్షణమే పట్టాలెక్కించాలని భావిస్తున్న సీఎం జగన్...జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టేల్‌పాండ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి- పెన్నా అనుసంధాన పనులు చేపట్టినా ఇవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. గోదావరి నీటిని మళ్లిస్తే కానీ...కృష్ణా, పెన్నాపరిధిలో అవసరాలు తీరేలా కనిపించడం లేదు. ఈ కారణంగానే.. ఈ పథకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.