వి.వి.లక్ష్మినారాయణ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు... జేడీ లక్ష్మినారాయణ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇట్టే గుర్తుపట్టేస్తారు. కడప జిల్లాలో జన్మించిన లక్ష్మీనారాయణ... మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 2006 నుంచి 2015వరకు సీబీఐ వంటి అత్యున్నత నేర విచారణ సంస్థలో పనిచేసి నిజాయితీ గల అధికారిగా పేరుతెచ్చుకున్నారు.
దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు లక్ష్మీనారాయణనేతృత్వంలోనే దర్యాప్తు జరిగింది. రామలింగ రాజు, జగన్, గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసునూ విచారించింది ఈయనే. అనంతరం పూణె పోలీసు కమిషనర్గా, మహారాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీ బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగా... ప్రభుత్వం ఆమోదించింది.
పదవీ విరమణ తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన ఈ మాజీ జేడీ... ఏ పార్టీలో చేరతారనేది చెప్పలేదు. కొత్త పార్టీ స్థాపిస్తారా లేక వేరే పార్టీలో చేరతారా అనే విషయంపై ఆసక్తి, ఉత్కఠ నెలకొన్నాయి. రాష్ట్రమంతా పర్యటిస్తూ... విద్యార్థులు, యువత, రైతులతో సమావేశాలు నిర్వహించారు. పలు పార్టీల నుంచి ఆహ్వానం అందినా... ఏ నిర్ణయం తీసుకోలేదు. లోక్సత్తా ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు జయప్రకాష్ నారాయణ్ ముందుకొచ్చారు. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి మంతనాలు జరపగా... తెదేపాలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జగన్ను జైలుకు పంపటంలో కీలక పాత్ర పోషించినందున... వైకాపా నుంచి తీవ్ర విమర్శలు వస్తాయని చంద్రబాబు భావించారు. అందుకు తగ్గట్లే సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విమర్శలతో బాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.